Share News

సిద్ధాంతాల కన్నా రాద్ధాంతాలెక్కువ!

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:54 AM

ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాల కన్నా రాద్ధాంతాలే ఎక్కువయ్యాయని, రాజకీయ క్రమశిక్షణ కొరవడిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

సిద్ధాంతాల కన్నా రాద్ధాంతాలెక్కువ!

  • ప్రస్తుతం రాజకీయ క్రమశిక్షణ కొరవడింది: వెంకయ్య

  • ప్రజల్లో పార్టీలు, నేతలపై అపనమ్మకం, అసహ్యం

  • దీని నుంచి బయటపడాలంటే రాజకీయ పాఠశాలలు అవసరం

  • నా ఎదుగుదలకు ఆరెస్సెస్‌ కారణం.. కడవరకు దానిని వదిలేది లేదు

  • ‘వెంకయ్య నాయకుడు’ పుస్తక పరిచయ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి స్పష్టీకరణ

విజయవాడ సిటీ, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాల కన్నా రాద్ధాంతాలే ఎక్కువయ్యాయని, రాజకీయ క్రమశిక్షణ కొరవడిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రాజకీయ పార్టీలు, వాటి గొడుగు కింద ఉన్న కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఇలా అందరిలోనూ చిత్తశుద్ధి లోపించిన కారణంగా ప్రజల్లో ఆయా పార్టీల పట్ల అపనమ్మకం, అసహ్యం ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దీని నుంచి బయటపడాలంటే దివంగత మొరార్జీ దేశాయ్‌ కాలంలో మాదిరిగా క్రమశిక్షణను నేర్పించే రాజకీయ పాఠశాలల అవసరం ఉందని సూచించారు. పాత్రికేయుడు మాశర్మ రచించిన ‘వెంకయ్య నాయకుడు’ పుస్తక పరిచయ కార్యక్రమం ఆదివారం విజయవాడలో జరిగింది. ఎమ్మెల్యే సుజనాచౌదరి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థి సంఘ నేతగా ఆర్‌ఎ్‌సఎ్‌సలో అరంగేట్రం చేశానని.. విద్యార్థి దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయి వరకూ చేరుకోవడానికి సంఘ్‌లో నేర్చుకున్న క్రమశిక్షణ, చిత్తశుద్ధే కారణమని ఆయన తెలిపారు. తాను కడ వరకూ ఆర్‌ఎ్‌సఎ్‌సను వదిలే ప్రసక్తే లేదన్నారు. వారసత్వ రాజకీయాలకు తాను పూర్తి వ్యతిరేకమని.. తన కుమారుడు, కుమార్తె స్వచ్ఛంద సేవలో దూసుకెళ్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి వరకూ సాగించిన సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చిన రచయిత మాశర్మను ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. అధికారం, డబ్బుతో చేసే రాజకీయాల కన్నా సిద్ధాంతపరంగా నడుచుకునే రాజకీయాలే పదికాలాల పాటు ఉంటాయని, ఇందుకు వెంకయ్యనాయుడు ఎదుగుదలే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. అనంతరం వెంకయ్యనాయుడిని గజమాల, పూలకిరీటాలు, దుశ్శాలువాలతో సత్కరించారు.

Updated Date - Jun 29 , 2026 | 05:55 AM