రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎక్కువైంది
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:26 AM
రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎక్కువైందని, దానివల్ల నాణ్యత, బాధ్యత కలిగినవారు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం తగ్గుతోందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
నాణ్యత, బాధ్యత గలవారి రాక తగ్గుతోంది
నీతి, నిజాయతీ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలి
విద్య, వైద్యం వ్యాపారమై పోయాయి
నిపుణులు ఆలోచించి విలువలను కాపాడాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు
కానూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎక్కువైందని, దానివల్ల నాణ్యత, బాధ్యత కలిగినవారు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం తగ్గుతోందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉన్నవారిని ఎన్నుకోవాలని సూచించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడ కానూరులోని సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీ ఆడిటోరియంలో సిద్ధార్థ న్యాయ కళాశాల, ఏపీ స్టేట్ కన్జ్యూమర్స్ బార్ అసోసియేషన్, సిద్ధార్థ వర్సిటీ ఆధ్వర్యంలో ‘వినియోగదారుల అవగాహన, సాధికారత’ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేటి రాజకీయాల్లో కులం, మతం, వర్గం, ప్రాంతీయత తదితర అంశాలు ప్రాధాన్యం వహిస్తున్నాయని చెప్పారు. నీతి, నిజాయతీ, సంప్రదాయం కలిగిన వ్యక్తులను రాజ్యాంగబద్ధ పదవులకు ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయం, విద్య, వైద్యం అనేవి మిషన్స్ అని, వాటిలో వ్యాపార ధోరణి ఉండరాదని స్పష్టం చేశారు. నేడు విద్య, వైద్యం వ్యాపారమై పోయాయని వాపోయారు. ఆయా రంగాల నిపుణులు ఆలోచించి విలువలను కాపాడాలని కోరారు. సేవాధోరణి పెరగాలని, ప్రాథమిక విద్య మాతృభాషలో సాగాలని, దీనివల్ల ఇతర భాషలను సులభంగా నేర్చుకోవచ్చని పేర్కొన్నారు.
మాతృభాష కళ్లు, ఆంగ్లం కళ్లజోడు లాంటివని చెప్పారు. కళ్లు లేకుంటే కళ్లజోడు వల్ల ఉపయోగంలేదన్నారు. 2019లో వచ్చిన వినియోగదారుల చట్టం వినియోగదారులకు ఎంతో వెసులుబాటు కల్పించిందని చెప్పారు. రాజ్యసభలో సభ్యులు 22 భాషల్లో ఏదో ఒక భాషలో మాట్లాడే అవకాశం కల్పించామని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ చీమలపాటి రవి మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను కాపాడటం, వారికి అవగాహన పెంచడం ఈ వినియోగదారుల దినోత్సవం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ దివాకర్‌బాబు, సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు ఎం.రాజయ్య, సిద్ధార్థ వర్సిటీ ప్రొఫెసర్ వీసీ రత్నప్రసాద్, ఏపీఎ్‌ససీడీఆర్‌సీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మన్నే హరిబాబు తదితరులు పాల్గొన్నారు.