Share News

ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి

ABN , Publish Date - May 03 , 2026 | 04:33 AM

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి, వాటిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి

  • ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయండి

  • మంత్రి లోకేశ్‌ పనితీరు భేష్‌: వెంకయ్య

వెంకటాచలం, మే 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి, వాటిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గొలగమూడిలో వెంకయ్యస్వామి జీవిత చరిత్ర ఆధారంగా రచించిన విశ్వంభరుడు పుస్తకాన్ని వెంకయ్య నాయుడు శనివారం ఆవిష్కరించి, ప్రసంగించారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ పనితీరు చాలా బాగుందని ప్రశంసించారు. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్‌ విద్యార్థులు మంచి ఫలితాలను సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఫలితాలు సాధించడంలో కష్టపడి పని చేసిన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కూడా చాలావరకు మెరుగుపడ్డాయని, పాఠశాలల అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారన్నారు. విద్యాశాఖపై మంత్రి లోకేశ్‌ మరింత దృష్టి పెట్టి, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఆధునిక సౌకర్యాలు, వసతులు, సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యా శాఖలో ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయాలని, అవసరమైన చోట హాస్టళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని కోరారు. మంచి చేసేవారిని ప్రోత్సహించడం మన కార్తవ్యమన్నారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని చెప్పారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్యపరంగా వెంకయ్యస్వామి ఆశ్రమం ఆధ్వర్యంలో ఎనలేని సేవలు అందిస్తున్నారన్నారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపావెంకట్‌, ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ సురేష్ రెడ్డి, ఆశ్రమ ఈఓ బాలసుబ్రహ్మణ్యం, ఆశ్రమ కమిటీ సభ్యులు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2026 | 04:35 AM