Share News

వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే..!

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:27 AM

‘వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే.. పూర్తి చేసి నీళ్లు ఇచ్చేదీ నేనే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు.

వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే..!

  • 30 ఏళ్ల క్రితం మార్చి 5న నాంది

  • దానిని పూర్తి చేసి నీళ్లు ఇచ్చేదీ నేనే: సీఎం

  • 2014-19 మధ్య 1,414 కోట్ల ఖర్చుతో వేగంగా పనులు చేయించాం

  • గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది

  • ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం

  • జూలై నాటికి తొలి దశ పూర్తి చేసి నీళ్లిస్తాం

  • 2027-28 నాటికి రెండో దశ కూడా

  • ‘ఎక్స్‌’లో చంద్రబాబు సుదీర్ఘ పోస్టు

అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ‘వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే.. పూర్తి చేసి నీళ్లు ఇచ్చేదీ నేనే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ‘ఎక్స్‌’లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. 1996 మార్చి 5.. తనకు ఇంకా గుర్తుందని, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలో తీవ్రమైన తాగు, సాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే వారి కష్టాలు తీర్చేందుకు 30 ఏళ్ల క్రితం తొలి అడుగు వేసిన రోజని గుర్తు చేసుకున్నారు. శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్‌ నుంచి 43.50 టీఎంసీలతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టుకు భూమి పూజ చేశానన్నారు. అనేక కారణాలతో తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలైన వెలిగొండ పనులను మళ్లీ 2014-19 మధ్య వేగవంతం చేశామని తెలిపారు. ప్రాజెక్టు కోసం నాడు రూ.1,414 కోట్లు ఖర్చు పెట్టామని, తర్వాత వచ్చిన ప్రభుత్వం అరకొర పనులతో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని తప్పుబట్టారు. ‘ప్రాజెక్టు పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవం అం టూ ప్రజలను మోసం చేసి నవ్వుల పాలైం ది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక వెలిగొండ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. రూ.140 కోట్లతో పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేశాం.


మరో రూ.585 కోట్లు ప్రాజెక్టు నిర్మాణంపై ఖర్చు చేశాం. హెడ్‌ రెగ్యులేటర్‌కు సంబంధించి 2,200 క్యూబిట్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయి. రూ.456 కోట్లతో ఫీడర్‌ కెనాల్‌ లైనింగ్‌, రిటైనింగ్‌ వాల్‌ పను లు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి తొలి దశ పనులు పూర్తి చేసి వెలిగొండకు కృష్ణా నీళ్లు తీసుకొస్తాం. 2027-28 నాటికి ఫేజ్‌-2 నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. ప్రజల దశాబ్దాల కలను నిజం చేసి, కరువు ప్రాంతంలో ప్రతి ఎకరానికీ నీళ్లిచ్చి రైతన్నల జీవితాలు మారుస్తాం. ఉద్యాన సాగుతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం’ అని హామీ ఇచ్చారు.

Updated Date - Mar 06 , 2026 | 04:28 AM