Share News

త్యాగం మీది.. అండ మాది!

ABN , Publish Date - Aug 20 , 2026 | 03:17 AM

వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవానికి గడువు దగ్గర పడుతున్న వేళ నిర్వాసిత గ్రామాల ప్రజలకు పరిహారం అందిస్తూ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది.

త్యాగం మీది.. అండ మాది!

  • వెలిగొండ నిర్వాసితులకు మరో 200 కోట్ల పరిహారం

  • చెక్కు అందించిన సీఎం చంద్రబాబు

  • ఇప్పటి వరకు 518 కోట్లు పరిహారం

  • మిగిలినది త్వరలోనే ఇస్తామన్న సీఎం

  • కూటమి ప్రభుత్వ మేలును మర్చిపోలేం: నిర్వాసితులు

అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవానికి గడువు దగ్గర పడుతున్న వేళ నిర్వాసిత గ్రామాల ప్రజలకు పరిహారం అందిస్తూ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ఈ ఏడాది జూన్‌ 27న రూ. 318 కోట్లు పరిహారం అందించిన ప్రభుత్వం, బుధవారం మరో రూ. 200 కోట్ల పరిహారాన్ని అందించింది. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు నిర్వాసిత కుటుంబాలకు ఆ చెక్కును అందజేశారు. దీంతో ఇప్పటి వరకు వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం రూ. 518 కోట్లు పరిహారంగా అందించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతులు, నిర్వాసితులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తోందని, వారికి అండగా నిలుస్తోందని చెప్పారు. మిగతా పరిహారం సొమ్మునూ త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. వెలిగొండ నిర్వాసితులను ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులతో పాటు మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు భావోద్వేగానికి లోనయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లావాసుల 30 ఏళ్ల కలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తమకు అన్ని సౌకర్యాలు కల్పించి తమ త్యాగానికి గుర్తింపునిచ్చారని, కూటమి ప్రభుత్వం చేసిన మేలును ఎన్నటికి మర్చిపోలేమని అన్నారు. చెక్కు పంపిణీ కార్యక్రమం తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడారు.


ఇది ఒక చరిత్ర: మంత్రి నిమ్మల

‘‘కరువు పీడిత, ఫ్లోరైడ్‌ బాధిత ప్రజల జీవితాల్లో వెలిగొండ ద్వారా వెలుగులు నింపబోతున్నాం. 1996లో చంద్రబాబు చేతుల మీదుగా వెలిగొండకు శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు చంద్రబాబు ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసి ఈ నెలలోనే నీరు ఇవ్వడం ఒక చరిత్ర. ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేసిన గొడ్డలి పార్టీ అధినేత జగన్‌ చరిత్ర హీనుడుగా ప్రజల మదిలో మిగిలిపోయాడు. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చే సిన ఘనుడు జగన్‌. నిర్వాసితులకు జగన్‌ హయాంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో జలవనరులశాఖ సమీక్ష చేసినపుడు 2026 ఆగస్టు కల్లా వెలిగొండని పూర్తి చేయాలని సీఎం చెప్పారు. ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా ఈ రెండేళ్లలో, హెడ్‌ రెగ్యులేటర్‌ సీసీ వాల్స్‌, వింగ్స్‌ అన్నీ కూడా 2026 మే నెలకి పూర్తి చేశాం. అదేవిధంగా కృష్ణానది నుంచి టన్నెల్‌ వరకు నీటి అప్రోచ్‌ చానల్‌ దగ్గర 80 వేల మెట్రిక్‌ టన్నులు మాక్‌ను కూడా తొలగించాం. నీరు వచ్చే మార్గాన్ని కూడా ఈ ఏడా దే ఏర్పాటు చేశాం. టన్నెల్‌లో 5 కిలోమీటర్ల బెంచింగ్‌ని ఈ రెండేళ్లలో పూర్తి చేశాం. కూటమి అధికారంలోకి వచ్చేసరికి టన్నెల్‌-2లో మిగిలిఉన్న 7,000 మీటర్ల లైనింగ్‌ పనుల్లో ఈ రెండేళ్లు రేయింబవళ్లు పని చేసి 6,907 మీటర్లు పూర్తి చేశాం. మిగిలిన పని ఐదారురోజుల్లో పూర్తి చేస్తాం.


టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) తొలగింపు విషయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేస్తే.. ఆ టీబీఎం తొలగింపులో న్యాయవివాదాలను సీఎం చంద్రబాబు స్వయంగా పరిష్కరించారు. 1,900 టన్నుల బరువు, 1,755 మీటర్ల పొడవు ఉన్న టీబీఎం మిషన్‌ తొలగింపును దాదాపు పూర్తి చేశాం. మిగిలిన 300 టన్నుల శకలాలు మరో నాలుగైదు రోజుల్లో తొలగిస్తాం. 21 కిలోమీటర్ల పొడవున్న ఫీడర్‌ కెనాల్‌కు సీఎం చంద్రబాబు రూ. 460 కోట్లు మంజూరు చేశారు. ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన చేసిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక తొలివిడతలో 2,557 మంది నిర్వాసితులకు, రెండో విడతలో 1,600 మంది నిర్వాసితులకు పరిహారం ఇచ్చాం. మిగిలిన నిర్వాసిత కుటుంబాలందరికీ ఈ నెలలోనే పరిహారం అందించాలని సీఎం ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి ప్రాజెక్టు ఎంత ముఖ్యమో నిర్వాసితులు కూడా అంతే ముఖ్యం. ఈ రెండేళ్లలోనే రూ. 3000 వేల కోట్లు వెచ్చించి వెలిగొండ కలను సీఎం చంద్రబాబు సాకారం చేశారు. నిర్వాసితులకు ఏర్పాటు చేసిన 7 కాలనీల్లో 4 వంద శాతం పూర్తయ్యాయి. మిగిలినవి త్వరలో పూర్తి చేస్తాం. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అర్హులై ఉండి పరిహారం జాబితాలో పేర్లు లేకపోవడం, గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేరు ఉన్నప్పటికీ అవార్డు పాస్‌ కాకపోవడం వంటి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నాం. వెలిగొండ నిర్వాసితులకు సంబంధించిన 11 గ్రామాల్లో 11 ప్రత్యేక కమిటీలు జిల్లా ఉన్నతాధికారుల ఆధ్వర్యం లో ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్నాయి. నిర్వాసిత కుటుంబానికి న్యాయం చేయడమే సీఎం లక్ష్యం’’ అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


నాలుగు జిల్లాలకు నీరు: మంత్రి డోలా

‘‘ఈ నెలాఖరులో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమలసాగర్‌కు కృష్ణాజలాలు ఇస్తాం. ఈ ప్రాజెక్టు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు మాత్రమే కాకుండా నెల్లూ రు, కడపలకు కూడా సాగు, తాగునీరు అందిస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. అందు లో భాగంగానే తొలి విడత రూ.318 కోట్లు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పుడు రెండో విడత గారూ.200 కోట్లు అందించాం. మిగిలిన సుమారు రూ.400 కోట్లను నిర్వాసితులకు త్వరలోనే చెల్లించి ఈ నెలలోనే నీరిస్తాం. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిన ఘనత జగన్‌కే చెల్లింది. ప్ర జలకు హామీ ఇచ్చినట్లే మార్కాపురం జిల్లా చేశాం.’’ అని మంత్రి డోలా వీరాంజనేయస్వామి అన్నారు.

వైసీపీ డ్రామాలు: ఎమ్మెల్యే కందుల

‘‘వెలిగొండ మా 30 ఏళ్ల కల. సీఎం చంద్రబాబు ఆ కలను నెరవేర్చారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. రాబోయే రెండు వారాల్లో వెలిగొండ ప్రారంభోత్సవం కార్యక్రమం జరుపుకోబోతున్నాం. ఇప్పటికే ప్రభుత్వం నిర్వాసితులకు రూ. 518 కోట్లు అందించింది. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు మభ్యపెట్టి.. డ్రామా చేసింది.’’ అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు.


సహదేవుడనే పేరు ఎందుకు పెట్టారు..?

అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న వెలిగొండ నిర్వాసితుల వద్దకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ వచ్చి వారి కుటుంబ వివరాలు, ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఓ నిర్వాసితుడు తన పేరు సహదేవుడు అని చెప్పడంతో.. శశిభూషణ్‌ ఆసక్తిగా ఆ పేరు ఎందుకు పెట్టార ని ప్రశ్నించారు. పాండవుల్లో చివరివాడు సహదేవుడని, తమ ప్రాంతంలో ఎక్కువ మంది పిల్లలను కని ఇక పిల్లలు వద్ద అనుకున్న వారు చివరగా పుట్టబోయే బిడ్డకు సహదేవుడు అనే పేరు పెడతామని మొక్కుకుంటారని, ఇక ఆ తర్వాత వారికి పిల్లలు పుట్టరని వివరించారు. తన తల్లిదండ్రులకు 8 మంది సంతానంలో తాను చివరివాడినని తెలిపారు. ఇది విని ఆశ్చర్యపోయిన శశిభూషణ్‌.. మీ అందరి తోబుట్టువులు ఎంతమంది అని అక్కడున్న నిర్వాసితులందరినీ అడిగారు. అందరూ 5కు తక్కువ కాకుండా సమాధానం ఇచ్చారు. సీఎం గారు ఎక్కువ మంది పిల్లలనుకనాలని చెబుతున్నారని ఆ సూచనలను పాటించినట్లు ఉన్నారని అన్నారు.


చంద్రబాబును ఎప్పటికి మర్చిపోలేం

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసినందుకు సీఎం చంద్రబాబును మేం ఎన్నటికీ మర్చిపోలేం. మేం అందరం సంతోషంగా ఖాళీ చేసి సహకరిస్తున్నాం. నిర్వాసితులకు ప్రభత్వం కాలనీలు కట్టించింది. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు.

-భీమవరం సహదేవుడు, సుంకేసుల గ్రామం.

ఏన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు. మాకు, మా పిల్లలకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం.

- అనుమల మూర్తమ్మ, సుంకేసుల గ్రామం.

ప్రాజెక్టు చూస్తాం అనుకోలేదు

జీవితంలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అనుకోలేదయ్యా. మా కల నెలవేరింది. ప్రాజెక్టు కోసం ఎంతో మంది ఎదురు చూసి కన్నుమూశారు. ప్రాజెక్టు పూర్తిని మేం చూశాం. ఇలాంటి పార్టీ, గొప్పనాయకుడు మాకు ఎప్పటికీ ఉండాలని అనుకుంటున్నాం. మాకు అన్ని సౌకర్యాలతో ఇచ్చిన ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనస్ఫూర్తిగా, ఆనంద బాష్పాలతోటి వెళుతున్నామయ్యా. సీఎం, మంత్రి, ఎమ్మెల్యే అన్ని పనులు సకాలంలో చేశారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. (ఆనందంతో కన్నీటి పర్యంతమవుతూ...)

-కాకర్ల కాలేబు, సుంకేసుల ఎస్సీ కాలనీ.

చాలా సంతోషంగా ఉన్నాం

మా 30 ఏళ్ల కల నెరవేరింది. మేం ఈ ప్రాజెక్టు చూస్తాం అనుకోలేదు. చాలా సంతోషంగా ఉన్నాం. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు.

- తుమ్మా పిచ్చిరె డ్డి,

వెలిగొండ నిర్వాసితుడు, గొట్టిపడియ గ్రామం.

సీఎంకు ధన్యవాదాలు

30 ఏళ్ల క్రితం కల కన్నాం. ఆ కల ఇప్పుడు నెరవేరింది. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు.

- బుర్రి లక్ష్మీదేవి,

వెలిగొండ నిర్వాసితురాలు, గొట్టిపడియ గ్రావ

Updated Date - Aug 20 , 2026 | 03:19 AM