వెలిగొండకు గొడ్డలి పార్టీ ఏం చేసిందని.. క్రెడిట్ చోరీ చేయాలి: అప్పసాని రాజేశ్
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:32 AM
క్రెడిట్ చోరీ డిజార్డర్‌తో బాధపడుతున్న జగన్... వెలిగొండ ప్రాజెక్టును తానే పూర్తి చేశానంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేశ్ ఎద్దేవా చేశారు.
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): క్రెడిట్ చోరీ డిజార్డర్‌తో బాధపడుతున్న జగన్... వెలిగొండ ప్రాజెక్టును తానే పూర్తి చేశానంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేశ్ ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘1996లోనే వెలిగొండకు చంద్రబాబు శంకుస్థాపన చేయగా, నేడు ఆయన హయాంలోనే అది పూర్తికానుంది. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు 11 మీటర్లు ఉండాల్సిన టన్నెల్‌ను 7 మీటర్లకు కుదించి, ఆయకట్టును 4.34 లక్షల నుంచి 1.19 లక్షల ఎకరాలకు తగ్గించే కుట్ర చేశారు. 2019 నాటికే 80 శాతం పూర్తయిన వెలిగొండను, వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసి, మిగిలిన 20 శాతం పనులను గాలికి వదిలేసింది. రూ.5 వేల కోట్ల పనులు పెండింగ్‌లో ఉండగానే జాతికి అంకితం అంటూ జగన్ దొంగ నాటకాలు ఆడారు. జగన్ హయాంలో 7555 మంది నిర్వాసితులకు ఒక్క పైసా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 2351 మందికి రూ.300 కోట్లు విడుదల చేసింది. మిగిలిన వారికి రూ.600 కోట్లు చెల్లించేందుకు అనుమతులిచ్చాం’ అని అప్పసాని తెలిపారు.