వెలిగొండకు.. నిధులేవీ?
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:18 AM
ప్రాజెక్టుల పూర్తికి నిర్ధేశించుకున్న లక్ష్యాలు ముంచుకొస్తున్నా నిధుల విడుదలలో ప్రభుత్వం మౌనంగా ఉండటంతో సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం
గడువు ముంచుకొస్తున్నా విడుదల కాని నిధులు
పునరావాసానికి రూ.886 కోట్లు అవసరం
భూసేకరణకు రూ.139.32 కోట్లు కావాలి
నిధుల విడుదలలో అధికారుల నిర్లక్ష్యం
అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టుల పూర్తికి నిర్ధేశించుకున్న లక్ష్యాలు ముంచుకొస్తున్నా నిధుల విడుదలలో ప్రభుత్వం మౌనంగా ఉండటంతో సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30ఏళ్ల కింద పునాది వేసిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు పదే పదే ఆదేశిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అధికారవర్గాలు నిధులు మంజూరు చేయడం లేదని అంటున్నారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాది జూన్ నాటికి జాతికి అంకితం ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. 2024లో అధికార పగ్గాలు చేపట్టాక వెలిగొండ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించించింది.
తక్షణమే రూ.2041 కోట్లు అవసరం
ఈ ఏడాది జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తికావాలంటే రూ.2041 కోట్లు అవసరమని ఈ నెల 15న ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో అధికారులు నివేదిక ఇచ్చారు. ఇందులో 7225 మంది నిర్వాసితులకు భూసేకరణ, సహాయ పునరావాసానికి రూ.886.55 కోట్లు కావాలని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అదేవిధంగా 1233.41 ఎకరాల భూసేకరణకు రూ.139.32 కోట్లు విడుదల చేయాలన్నారు. భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకు రూ.1025.87 కోట్లు విడుదల చేస్తే.. జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయగలమని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ అంశంపై ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్‌రోస్, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సమావేశమై.. నిధుల విషయంలో జాప్యం లేకుండా చూసుకోవాలన్నారు. రూ.1025.87 కోట్లు విడుదల చేస్తే నిర్వాసితులకు పునరావాసం కల్పించవచ్చని అధికారులు చెబుతున్నారు. నిర్వాసితులు ప్రాజెక్టు ప్రాంతాన్ని ఖాళీ చేస్తే తప్ప గరిష్ఠస్థాయిలో నీటిని నింపేందుకు అవకాశం ఉండదని అంటున్నారు. నిర్వాసితులు ఖాళీ చేసేందుకు మరో 60 రోజుల మాత్రమే ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా సహాయ, పునరావాస మౌలిక సదుపాయాల కోసం రూ.37 కోట్లు అవసరమని చెబుతున్నారు.
కెనాల్ నెట్‌వర్క్ కోసం రూ.341.68 కోట్లు, టన్నెల్ పనులు, మెయిన్ కెనాల పనులకు రూ.637.43 కోట్లు అవసరమని సమీక్షలో అధికారులు చెప్పారు. హెడ్‌రెగ్యులేటర్‌ను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ చెబుతోంది. రెండో టన్నెల్ బెంచింగ్ పనులను మే 15 నాటికి, లైనింగ్ పనులను జూన్ 30 నాటికి పూర్తి చేస్తానని కాంట్రాక్టు సంస్థ అంగీకరించింది. ఫీడర్ కెనాల్‌ను జూన్ నాటికి పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ ఒప్పందం చేసుకుంది. తీగలేరు కెనాల్ హెడ్‌వర్క్స్‌ను కూడా జూన్ నాటికి పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ చెబుతోంది. ఈస్ట్రన్ మెయిన్ కెనాల్‌ను కూడా జూన్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. మళ్లింపు రహదారి పనులూ జూన్ నాటికి పూర్తవుతాయని ప్రభుత్వం వెల్లడిస్తోంది. దుర్భిక్ష ప్రాంతం ప్రకాశం.. ఒంగోలు ప్రాంతాలకు తాగు, సాగు నీరందించే వెలిగొండను పూర్తిచేసే.. చివరి క్షణాల్లో నిధుల కోసం ఇబ్బందులు పడటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.