మొన్న ఉద్వేగం.. నేడు ఉత్సాహం
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:08 AM
మూడు దశాబ్దాల కల నెరవేరింది. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందింది. వారి వ్యక్తిగత ఖాతాల్లో సోమవారం నగదు జమ కావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
వెలిగొండ నిర్వాసితుల ఖాతాల్లో పడిన పరిహారం
2,351 మందికి రూ.300 కోట్లు జమ.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
మార్కాపురం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): మూడు దశాబ్దాల కల నెరవేరింది. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందింది. వారి వ్యక్తిగత ఖాతాల్లో సోమవారం నగదు జమ కావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. నిర్వాసితులకు పరిహారం కోసం రూ.905 కోట్లు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. అందులో తొలివిడతగా రూ.300 కోట్లు విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం వెలిగొండ ప్రాజెక్టు వద్దకు వచ్చి నిర్వాసితులతో మాట్లాడి పరిహారంపై భరోసా ఇచ్చారు. ఆ సమయంలో నిర్వాసితులు ఉద్వేగానికి లోనై పలువురు కంటతడిపెట్టారు. ఆ రోజు ఉద్వేగానికి గురైన వారు సోమవారం వారి ఖాతాల్లో నగదు పడడం చూసి ఉత్సాహంగా తోటివారితో ఆనందం పంచుకుంటున్నారు. ఆర్‌అండ్‌ఆర్, వన్‌టైం సెటిల్‌మెంట్ కింద వివిధ విభాగాల్లో ఒక్కొక్కరి వ్యక్తిగత ఖాతాల్లో రూ.13,01,000, రూ.12.76,000, రూ.12.50,000, రూ. 11,76,000 చొప్పున జమయ్యాయి. మొత్తం 2,351 మందికి నగదు జమ కావడం సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ ఆనందంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామాల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమకు నగదు పడిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా షేర్ చేయడం ప్రారంభించారు.
30 ఏళ్ల కల నెరవేరింది..
30 ఏళ్లుగా నిరీక్షిస్తున్న మాకు సీఎంగా చంద్రబాబు రాకతో మంచి రోజులొచ్చాయి. గత పాలకులు మావైపు కన్నెత్తి కూడా చూడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక చెప్పిన మాట ప్రకారం ప్రాజెక్టు పనులు చేపట్టడంతో పాటు మా పరిహారం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. నా ఖాతాల్లో రూ.12,50,000 జమయ్యాయి.
- ఖాశిం వలీ, సుంకేసుల
మా భవిష్యత్‌కు భరోసా..
కూటమి రాకతో మా బతుకులు మారతాయని ముందుగానే విశ్వసించాం. మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా రూ. 300 కోట్లు పరిహారం ఇవ్వడం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పుడు మా భవిష్యత్‌కు భరోసా దొరికింది. నా వ్యక్తిగత ఖాతాలో రూ.11,76,000 జమయ్యాయి.
- అనుముల ప్రసాద్, సుంకేసుల