Share News

వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు

ABN , Publish Date - Aug 26 , 2026 | 06:01 AM

‘తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైంది. 31 నుంచి మొదలయ్యే వెలిగొండ జల సిరులు...

వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు

  • 30 ఏళ్ల నాటి సంకల్పం నేడు సాకారం

  • నల్లమల సాగర్‌కు 10.7 టీఎంసీల నీరు విడుదల

  • 31న మార్కాపురం జిల్లా వేదికగా చారిత్రక ఘట్టం ఆవిష్కరణ

  • శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవుని చెంతకు ‘కృష్ణమ్మ’: సీఎం

అమరావతి, ఆగస్లు 25(ఆంధ్రజ్యోతి): ‘తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైంది. 31 నుంచి మొదలయ్యే వెలిగొండ జల సిరులు... ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడుగుతాయి. ఈ జలంతోనే జీవం-జీవితం... సాగు-బాగు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఫొటోనూ జత చేశారు. ‘‘ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో వెలిగొండ ఫేజ్‌-1ని పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నాం. మూడు దశాబ్దాల తర్వాత నేను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాను. 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేయబోతున్నాం. ఈ చారిత్రక ఘట్టానికి ఈ నెల 31 మార్కాపురం జిల్లా వేదిక కాబోతోంది. దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ... వెలుగుల దండ అవుతుంది. నెర్రెలు బారిన నేలను కృష్ణా జలాలతో తడపబోతున్నాం. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లలను హార్టికల్చర్‌ హబ్‌గా చేసేందుకు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చి పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ప్రజల జీవితాలు మార్చాలి, వెనుకబాటును దూరం చేయాలనే గట్టి పట్టుదలతో శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవుని చెంతకు కృష్ణమ్మను తీసుకువస్తున్నాం. ప్రతి రైతు పొలానికి నీరు... ప్రతి యువకుడికి ఉపాధి... ప్రతి కుటుంబానికి భరోసా... ఇదే ‘సీబీఎన్‌ అనే నేను’ సంకల్పం. ప్రతి పౌరుడూ వ్యక్తిగత విజయాలు సాధిస్తూ జాతి నిర్మాణంలో భాగస్వామి కావాలి’’ అని సీఎం పిలుపునిచ్చారు.

Updated Date - Aug 26 , 2026 | 06:02 AM