భరోసా కల్పించారయ్యా!
ABN , Publish Date - Jun 28 , 2026 | 05:22 AM
వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులతో ముఖ్యమంత్రి సమావేశం ప్రారంభం కాగానే పలువురు భావోద్వేగానికి గురయ్యారు. సీఎంను చూడగానే పలువురు రైతులు ఆయనకు..
సీఎం ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతు
పాదాభివందనాలు చేసిన నిర్వాసితులు
మార్కాపురం, జూన్ 27(ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులతో ముఖ్యమంత్రి సమావేశం ప్రారంభం కాగానే పలువురు భావోద్వేగానికి గురయ్యారు. సీఎంను చూడగానే పలువురు రైతులు ఆయనకు ఎదురెళ్లి పాదాభివందనం చేశారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు స్వయంగా సీఎం రావటంపై గుండంచర్లకు చెందిన ఖాశిం అనే నిర్వాసితుడు కన్నీటిపర్యంతం అయ్యాడు. గత పాలకులు పరిహారం అడిగితే అరెస్టులు చేశారని, వేధించారంటూ అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు. పునరావాసం డబ్బులు జమ చేయడం ద్వారా తమ పిల్లల చదువు, భవిష్యత్తుపై భరోసా కల్పించారంటూ మరో నిర్వాసితుడు ప్రసాద్ సీఎం ఎదుట భావోద్వేగానికి గురయ్యారు. వెలిగొండ పనులు చకచకా జరగటం వల్ల 30ఏళ్ల నాటికల సాకారం చేస్తున్నారంటూ కొందరు సీఎంకు పాదాభివందనం చేయటానికి ప్రయత్నిస్తుండగా ఆయన వారిని వారించారు. వారితో కలిసి కూర్చొని ఫొటోలు దిగారు.