వేద విద్యార్థికి విధి శాపం
ABN , Publish Date - May 19 , 2026 | 05:37 AM
వేదాధ్యయనం చేస్తున్న ఓ విద్యార్థిపై విధి పగబట్టింది. అనుకోని ప్రమాదంలో ఆసుపత్రి పాలైన ఆ బాలుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో...
విద్యుదాఘాతంతో రెండు చేతులూ తొలగింపు
దాతల సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు
(గుంటూరు, ఆంధ్రజ్యోతి)
వేదాధ్యయనం చేస్తున్న ఓ విద్యార్థిపై విధి పగబట్టింది. అనుకోని ప్రమాదంలో ఆసుపత్రి పాలైన ఆ బాలుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో తన కుమారుడిని కాపాడాలంటూ తల్లిదండ్రులు దాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మూడేళ్లుగా గుంటూరు సంపత్‌నగర్‌లోని శృంగేరి వేద పాఠశాలలో స్మార్త విద్య అభ్యసిస్తున్న శ్రీగిరిరాజు నాగ వెంకట కోటి సాత్విక్ శర్మ(16), వేసవి సెలవుల నిమిత్తం తన స్వస్థలం హైదరాబాద్‌కు వెళ్లి ఘోర ప్రమాదానికి గురయ్యాడు. గత నెల 28న సంధ్యావందనం పూర్తి చేసుకొని, అంగవస్ర్తాన్ని ఆరేసే ప్రయత్నంలో అనుకోకుండా ఆ వస్త్రం సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురైన సాత్విక్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అతని రెండు చేతులను మోచేతుల వరకు, కాళ్ల వేళ్లను కూడా తొలగించారు. ఇంత ఘోర ప్రమాదానికి గురైనా ఆ బాలుడి ధైర్యం మాత్రం చలించలేదని గురువులు చెబుతున్నారు. ‘శరీరం దెబ్బతిన్నా.. వేదాభ్యాసం ఆపను’ అని సాత్విక్ చెప్పిన మాటలు అందరికీ కంటతడి పెట్టిస్తున్నాయి. సాత్విక్ తండ్రి శివకుమార్ శర్మ సాధారణ పురోహితుడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండటంతో, ప్రస్తుతం జరుగుతున్న చికిత్స భారాన్ని భరించలేని స్థితిలో ఉన్నారు. సాత్విక్ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంకా పలు శస్త్రచికిత్సలు అవసరమని, దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో శృంగేరి వేద పాఠశాల గురువులు, అధ్యాపకులు, కార్యవర్గ సభ్యులు కలిసి ఆస్తిక మహాజనులను, దాతలను సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్రాంచ్ హెడ్ బిదురు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సహాయం చేయదలిచిన వారు కిరణ్మయి.. 99898 28909 నంబర్‌కు గూగుల్ పే, ఫోన్‌పేకు నగదు పంపాలని నిర్వాహకులు విన్నవించారు.