Share News

వేదవతికి మోక్షం

ABN , Publish Date - May 10 , 2026 | 11:27 PM

రెండేళ్లలో శంకుస్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసే 25 ప్రాజెక్టులతో సీఎం చంద్రబాబు ఇరిగేషన క్యాలెండర్‌ ప్రకటించారు.

   వేదవతికి మోక్షం
హంద్రీనీవా కాలువ వద్ద అసంపూర్తిగా వేదవతి ప్రాజెక్టు స్టేజ్‌-3 పంపింగ్‌ స్టేషన పనులు

ఇరిగేషన క్యాలెండర్‌ను ప్రకటించిన సీఎం చంద్రబాబు

రెండేళ్లలో పూర్తి చేసేలా షెడ్యూల్‌

పశ్చిమ ప్రాంత రైతుల్లో చిగురించిన ఆశలు

ఆర్డీఎస్‌, గుండ్రేవుల ప్రాజెక్టులకు దక్కని స్థానం

కర్నూలు, మే 9 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో శంకుస్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసే 25 ప్రాజెక్టులతో సీఎం చంద్రబాబు ఇరిగేషన క్యాలెండర్‌ ప్రకటించారు. ఆ జాబితాలో వేదవతి ఎత్తిపోతల పథకం కూడా ఉంది. పశ్చిమ ప్రాంతం పల్లెసీమల్లో కరువు, వలసలు నివారణే లక్ష్యంగా చేపట్టిన వేదవతి ప్రాజెక్టును 2028 జూన ఆఖరు నాటికి పూర్తి చేస్తామని షెడ్యూల్‌ ఇవ్వడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే.. ప్రాజెక్టు పూర్తవ్వాలంటే భూ సేకరణ ఎంతో కీలకం. రైతులను ఒప్పించి భూ సేకరణ కష్టాలు అధిగమించాల్సి ఉంది. కాంట్రాక్ట్‌ సంస్థను ఒప్పించి తక్షణం పనులు మొదలు పెట్టాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఇరిగేషన క్యాలెండర్‌లో కీలకమైన ఆర్డీఎస్‌ కుడి కాలువ, గుండ్రేవుల ప్రాజెక్టులు లేవు. అంటే.. ఆ ప్రాజెక్టులు ఎండమావిగా మిగిలిపోతాయా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆలూరు, ఆదోని నియోజకవర్గాల సరిహద్దుల్లో వేదవతి (హగరి) నది ప్రవహిస్తోంది. ఏటా 30-45 టీఎంసీల వరద జలాలు తంగభద్రలో కలుస్తున్నాయని దివంగత రిటైర్డ్‌ ఇంజనీరు సుబ్బరాయుడు అంచనా వేశారు. ఆ వరద నీటిని ఒడిసిపట్టి కరువు నేలకు మళ్లిస్తే.. ఆలూరు, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు ఇవ్వవచ్చని రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ (డీపీఆర్‌) ఇవ్వాలని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.2 కోట్లు నిధులు విడుదల చేశారు. వేదవతి నది, అవసరాన్ని బట్టి హంద్రీ-నీవా కాలువ నుంచి 8 టీఎంసీలు ఎత్తిపోసి సాగు, తాగునీరు ఇవ్వడానికి అనుకూలతలు ఉన్నాయంటూ 2016లో సర్వే సంస్థ నాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు, రూ.1,942.38 కోట్లు నిధులు మంజూరు చేస్తూ 2019 జవనరిలో జీవో ఆర్‌టీ నెం.77 జారీ చేసింది. ఫిబ్రవరిలో టెండర్లు పిలవగా హైదరాబాద్‌కు చెందిన మెఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ సంస్థ 4.69 శాతం అధిక (ఎక్సెస్‌) రేట్లకు దక్కించుకుంది. పనులు దక్కించుకున్న మెఘా కంపెనీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అదే ఏడాది ఎన్నికలు రావడం, మేలో జగన ఆధ్వర్యంలో ఏర్పడి వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల నిర్లక్ష్యం వేదవతి ప్రాజెక్టుకు శాపంగా మారింది. గంపెడు మట్టి కూడా తీయలేదు. చేసిన పనులకు దాదాపు రూ.వంద కోట్లు బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్‌ సంస్థ చేతులెత్తేసింది.

ఎట్టకేలకు వేదవతికి మోక్షం

వేదావతి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా హాలహర్వి మండలం గూళ్యం సమీపంలో వేదవతి నది నుంచి హాలహర్వి రిజర్వాయరు వరకు ప్రెజర్‌ మెయిన పైపులైన-1, అక్కడి నుంచి మొలగవెళ్లి జలాశయం వరకు ప్రెజర్‌ మెయిన పైపులైన-2, మద్దికెర మండలం బూరుజుల సమీపంలో హంద్రీ-నీవా కాలువ 128 కి.మీ.ల నుంచి మొలగవెళ్లి జలాశయం వరకు ప్రెజర్‌ మెయిన పైపులైన-3, వేదవతి నది వద్ద, హంద్రీ-నీవా కాలువ వద్ద ప్రధాన పంపింగ్‌ కేంద్రాలు, హాలహర్వి, మొలగవెళ్లి జలాశయాలు, అక్కడి నుంచి మెయిన కెనాల్స్‌, పంట కాలువలు, డిసి్ట్రబ్యూరీలు.. వంటి నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో బిల్లులు రావని ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. 2014 జూన 12న సీఎం చంద్రబాబు సారథ్యంలో మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అదిగో ఇదిగో అంటూ రెండేళ్లు గడిచిపోయాయి. అయితే.. రాబోయే రెండేళ్లల్లో రాష్ట్రంలో 25 ప్రాజెక్టులు పూర్తి, శంకుస్థాపనలు చేస్తామని శుక్రవారం సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ఇరిగేషన క్యాలెండర్‌ ప్రకటించారు. ఆ జాబితాలో వేదవతి ప్రాజెక్టును చేర్చడమే కాకుండా 2018 జూన ఆఖరు నాటికి పూర్తి చేస్తామని షెడ్యూల్‌ ఇచ్చారు. ఈ నిర్ణయంతో ఆలూరు, ఆదోని నియోజకవర్గాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భూ సేకరణ కష్టాలు అధిగమిస్తేనే..

వేదవతి ప్రాజెక్టులో భాగంగా హాలహర్వి మండలం బిలేహాల్‌, ఆలూరు మండలం అరికెర గ్రామాల మధ్య 2.037 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే హాలహర్వి జలాశయం, ఆలూరు మండలం మొలగవెళ్లి, చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామాల మధ్య 1.27 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే మొలగవెళ్లి జలాశయం, 30 కిలో మీటర్లు 1,2,3 ప్రెజర్‌ మెయిన పైపులైన్లు, 19 కిలో మీటర్లు గ్రావిటీ కెనాల్‌ నిర్మాణాలు, వేదవతి నది, హంద్రీ-నీవా కాలువ వద్ద ప్రధాన పంపింగ్‌ కేంద్రాలు సహా వివిధ నిర్మాణాల కోసం 4,781 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండగా.. 276.46 ఎకరాలు ఎస్‌డీసీ సర్వే, 427.97 ఎకరాలు ఎంజాయ్‌మెంట్‌ సర్వే పూర్తి చేశారు. 43.33 ఎకరాలకు డ్రాప్ట్‌ డిక్లరేషన స్టేజ్‌లో ఉంటే.. అవార్డు స్టేజ్‌లో కేవలం 17.24 ఎకరాలు మాత్రమే ఉంది. ఎకరాకు రూ.8 లక్షలు చొప్పున రూ.382.48 కోట్లు నిధులు అసరమని ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక. ప్రస్తుతం భూములు కోల్పోతున్న గ్రామాల్లో ఎకరం రూ. 10 నుంచి రూ.15 లక్షల వరకు పలుకుతోంది. ఈ లెక్కన దాదాపుగా రూ.600-650 కోట్లకు పైగా భూసేకరణకు నిధులు అవసరం ఉందని అంచనా. హంద్రీ-నీవా కాలువ, హగరి నది వద్ద భూ నష్టపరిహారం నిధులు ఇవ్వలేదని రైతులు అడ్డుకోవడంతో పంపింగ్‌ స్టేషన పనులు మధ్యలో ఆగిపోయాయి. రైతులను ఒప్పించి భూ సేకరణ కష్టాలు అధిగమిస్తేనే రెండేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం నిపుణులు అంటున్నారు.

ఆర్డీఎస్‌, గుండ్రేవుల ప్రాజెక్టులకు దక్కని స్థానం

మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లోనే వలసలు శాశ్వత పరిష్కారం నివారించాలనే లక్ష్యంగా గత టీడీపీ ప్రభుత్వం ఆర్డీఎస్‌ కుడి కాలువ నిర్మాణం కోసం రూ.1,985.42 కోట్లు నిధులు మంజూరు, పరిపాలన అనుమతులు ఇస్తూ 2019 జనవరిలో జీవో ఆర్టీ నెంబర్‌ 76 జారీ చేసింది. ప్రాజెక్టులో భాగంగా కోసిగి మండలం ఆర్డీఎస్‌ ఆనకట్ట నుంచి కర్నూలు రూరల్‌ మండలం ఆల్చాల వరకు దాదాపు 160 కిలోమీటర్లు ప్రధాన కాలువ, కోసిగి, పెద్దకడబూరు, కోటేకల్లు, చిన్నమర్రివీడు జలాశయాలు నిర్మించాలి. నాలుగు టీఎంసీలు మళ్లించి 40,270 ఎకరాలకు సాగునీరు, 60 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యం. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌సీసీ లిమిటెడ్‌ సంస్థ పనులు దక్కించుకొని ఆర్డీఎస్‌ ఆనకట్ట వద్ద హెడ్‌ వర్క్‌ పనులు, కాలువ నిర్మాణం పనులు చేశారు. అయితే వైసీపీ హయాంలో పనులు అటకెక్కాయి.

కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కేసీ కాలువ ద్వారా 2.65,628 ఎకరాల సాగునీరు ఇవ్వాలి. కేడబ్ల్యూడీటీ-1 అవార్డు మేరకు 31.90 టీఎంసీలు నిఖర జలాలు వాటా కేటాయించారు. ఆ నీటిని నిలుపుకొనే జలాశయం లేదు. తంగభధ్ర నది వరద రోజుల్లో 21.90 టీఎంసీలు నది ప్రవాహం ద్వారా తీసుకోవాలి. వరద రోజులు తగ్గడంతో కేసీ ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ఈ కష్టాలు అధిగమించాంటే సుంకేసులు బ్యారేజ్‌ ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో తుంగభద్రపై గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి 2019 జనవరిలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం రూ.2,890 కోట్లు మంజూరు చేస్తూ జీఓ ఆర్టీ నెంబరు 153 జారీ చేశారు. అదే ఏడాది మార్చి 2న కోడుమూరులో కృతజ్ఞత శిలాఫలకం ఆవిష్కరించారు. అంతర్రాష్ట్ర సమస్య అంటూ గత వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుపై ఆశలు చిగురించాయి. సీఎం చంద్రబాబు ప్రకటించిన ఇరిగేషన క్యాలెండర్‌లో ఈ రెండు ప్రాజెక్టులకు స్థానం దక్కలేదు. దీంతో ఆర్డీఎస్‌, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మాణం ప్రశ్నార్థకమేనా..? పశ్చిమ ప్రాంత కరువు రైతుల మదిలో వేదిస్తున్న ప్రశ్న ఇది.

Updated Date - May 10 , 2026 | 11:27 PM