కాజ బ్లాక్‌లో ‘వేదాంత’కు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - May 20 , 2026 | 04:46 AM
కృష్ణా జిల్లాలో చమురు, సహజవాయువు నిక్షేపాల వెలికితీతకు కేంద్రం అనుమతి తెలిపింది. ఇక్కడి కాజ బ్లాక్‌లో ‘వేదాంత’ లిమిటెడ్ చేపట్టే చమురు, సహజవాయు వెలికితీత, అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అనుమతులు జారీ చేసింది.
చమురు, సహజవాయువు నిక్షేపాల వెలికితీతకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు
ఓఎన్‌జీసీ వదిలేసిన బావుల్లో డ్రిల్లింగ్
రోజుకు 30 వేల బ్యారెళ్ల చమురు, 30 మిలియన్ మెట్రిక్ ఫీట్ల గ్యాస్ ఉత్పత్తి
20 బావులు తవ్వకం, 10 వెల్‌హెడ్స్
మొత్తం 114.93 చ.కి.మీటర్లలో ప్రాజెక్టు విస్తరణ
(విజయవాడ- ఆంధ్రజ్యోతి)
కృష్ణా జిల్లాలో చమురు, సహజవాయువు నిక్షేపాల వెలికితీతకు కేంద్రం అనుమతి తెలిపింది. ఇక్కడి కాజ బ్లాక్‌లో ‘వేదాంత’ లిమిటెడ్ చేపట్టే చమురు, సహజవాయు వెలికితీత, అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అనుమతులు జారీ చేసింది. ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ చేసి వదిలివేసిన కాజ బ్లాక్ ప్రాంతంలో ఇంధన నిక్షేపాలను వెలికితీసేందుకు ప్రభుత్వానికి వేదాంత సంస్థ దరఖాస్తు చేసుకుంది. కృష్ణా జిల్లాలోని మొవ్వ, గూడూరు, మచిలీపట్నం, పామర్రు పరిసర ప్రాంతాల్లో ఈ కాజ బ్లాక్ ఉంది. ‘కాజ బ్లాక్ ఆన్‌షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ డెవల్‌పమెంట్ అండ్ ప్రొడక్షన్’ పేరుతో ఈ ప్రాజెక్టును వేదాంత చేపట్టనుంది. రూ. 650కోట్ల వ్యయంతో ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుంది. ఇక్కడి నుంచి రోజుకు 30 వేల బ్యారెళ్ల చమురు, 30 మిలియన్ల మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. 114.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాజెక్టు విస్తరిస్తుంది. మొత్తం ప్రాజెక్టుకు కావాల్సిన 90 హెక్టార్ల భూమి కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంధన నిక్షేపాలను వెలికి తీసేందుకు మొత్తం 20 బావుల (డ్రిల్లింగ్)ను తవ్వడానికి వేదాంత అనుమతులు కోరగా, వాటి అన్నింటికీ అనుమతులు వచ్చాయి. హైడ్రో కార్బన్ ప్రాసెసింగ్ కోసం మొత్తం 10 వెల్ ప్యాడ్‌లను ఏర్పాటు చేయటానికి కూడా అనుమతులు వచ్చాయి.
ఈ వెల్‌ప్యాడ్‌ల నుంచి గ్యాస్ రవాణా కోసం ప్రత్యేక పైపులైన్లను వేస్తారు. వీటిని గెయిల్, మేఘా సంస్థల మెయిన్ హెడర్ పైపులైన్లకు అనుసంధానిస్తారు. చమురు, సహజవాయు నిక్షేపాలను వెలికితీయటానికి రోజుకు 1,000 కిలో లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఈ నీటిని బోర్ల ద్వారా సేకరిస్తారు. భారీ ప్రాజెక్టు ఏర్పాటుతో వచ్చే కాలుష్య ప్రమాద నియంత్రణ కోసం రూ.33 కోట్లను వేదాంత ఖర్చు చేస్తుంది. వార్షిక నిర్వహణ ఖర్చు రూ.3.3 కోట్లుగా ఉంటుంది. మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణంలో 29.7 హెక్టార్ల (33 శాతం)లో గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేస్తారు. బావులలో డ్రిల్లింగ్ ద్వారా వచ్చే వ్యర్థాలను మొబైల్ ఈటీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేస్తారు. దీనిద్వారా రోజుకు 30 కేఎల్‌డీ వ్యర్థ జలాలు వస్తాయి. శుద్ధి చేసిన నీటిని తిరిగి డ్రిల్లింగ్ కార్యకలాపాలకు వినియోగిస్తారు. ఈ ప్రాజెక్టు వెలువడే కాలుష్య నియంత్రణ చర్యలకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ బడ్జెట్ కేటాయింపులు జరిపేలా చర్యలు తీసుకుంది. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చుట్టుపక్కల గ్రామాల కోసం హాస్పిటల్ ఏర్పాటు, అంబులెన్స్ సేవల కోసం వేదాంత సంస్థ రూ. 10 కోట్లను కేటాయించనుంది.