Share News

అమల్లోకి వీబీ-జీరామ్‌జీ

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:27 AM

గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005 స్థానంలో కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌- గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ ...

అమల్లోకి వీబీ-జీరామ్‌జీ

  • వేతనం ఏపీలో రూ.5, తెలంగాణలో రూ.1 పెంపు

  • నేడు తిరుపతి జిల్లాలో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి చౌహాన్‌

  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ హాజరు

  • ‘ఉపాధి హామీ’ స్థానంలో కొత్త పథకం

  • వేతనాల రేట్లను ప్రకటించిన కేంద్రం

  • 21 రాష్ట్రాల్లో సగటు వేతనం రూ.300

  • అత్యధికంగా హరియాణాలో రూ.409

  • దక్షిణాది రాష్ట్రాల్లో పెంపు 3ు లోపే

అమరావతి/న్యూఢిల్లీ, జూలై 1(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005 స్థానంలో కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌- గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ (గ్రామీణ్‌) (వీబీ-జీరామ్‌జీ) చట్టం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం కింద పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే కార్మికుల వేతన రేట్లను కేంద్రం నోటిఫై చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం... వివిధ రాష్ట్రాల్లో రోజువారీ వేతనాలు రూ.300 నుంచి గరిష్ఠంగా రూ.409 వరకూ చెల్లించనున్నారు. సిక్కింలోని 3 గ్రామ పంచాయతీల్లో (నాథాంగ్‌, లాచుంగ్‌, లాచెన్‌) మాత్రం ప్రత్యేకంగా రూ.450 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పథకంలో చెల్లించిన వేతనాలతో పోలిస్తే అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, హిమాచల్‌పద్రేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, జార్ఖండ్‌, అస్సాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో వేతనాల పెంపు 15 శాతానికి పైగా నమోదైంది. ఇక దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో 3 శాతం కంటే తక్కువే పెరగడం గమనార్హం. తాజా వేతన సవరణలో ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొత్త వేతన రేట్లు ఇలా...

గుజరాత్‌, మణిపూర్‌, మిజోరాం, రాజస్థాన్‌, ఒడిశా, జమ్మూ కశ్మీర్‌, లద్ధాఖ్‌, మేఘాలయా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, అస్సాం, త్రిపుర, బిహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ (షెడ్యూల్డ్‌ ప్రాంతాలు కానివి), అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ రాష్ట్రాలకు వేతన సగటు రూ.300గా నిర్ణయించారు. మహారాష్ట్ర రూ.317, దాద్రా, నగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూలకు రూ.340, తమిళనాడులో రూ.345, పుదుచ్చేరిలో రూ .347, అండమాన్‌ నికోబార్‌ (అండమాన్‌ జిల్లా)తో పాటు లక్షద్వీ్‌పలో రూ.348, పంజాబ్‌లో రూ.360, అండమాన్‌, నికోబార్‌ (నికోబార్‌ జిల్లా)లో రూ.367, హిమాచల్‌ ప్రదేశ్‌ (షెడ్యూల్డ్‌ ప్రాంతాలు)లో రూ.375, కర్ణాటకలో రూ.382, కేరళలో రూ.401, గోవాలో రూ.406 చొప్పున చెల్లించనున్నారు.


తెలుగు రాష్ట్రాలపై చిన్నచూపు

వీబీ-జీరామ్‌జీ పథకం కింద వేతనాల ఖరారులో తెలుగు రాష్ర్టాలపై కేంద్రం చిన్నచూపు చూసింది. ఏపీలో గతంలో ఉన్న రూ.307 వేతనాన్ని ప్రస్తుతం రూ.5 పెంచి రూ.312గా ఖరారు చేశారు. ఇక తెలంగాణలో ఇప్పటివరకూ ఇచ్చిన రూ.307కు గాను కేవలం ఒక్క రూపాయి మాత్రమే పెంచి రూ.308 వేతనంగా నిర్ణయించారు. ఈ కొత్త వేతనాలు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి. కాగా, ఉపాధి కూలీలపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శించారు. కనీస వేతనం రూ.400 చేయాలని డిమాండ్‌ చేశారు.

నిజమైన పెంపు కాదు

వీబీ-జీరామ్‌జీ కింద ప్రకటించిన వేతనాలు ఉపాధి హామీ పథకంలో చెల్లించిన దానికంటే ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ దీనిని నిజమైన పెంపుగా పరిగణించలేమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ వేతనాలను సవరించలేదు. చివరిసారిగా గతేడాది మార్చి 27న ఉపాధి వేతనాలను సవరించిన కేంద్రం వాటిని 2025-26 ఆర్థిక సంవత్సరానికి వర్తింపజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్‌- జూన్‌) కూడా వాటినే కొనసాగించింది. 2026-27లోనూ ఉపాధి హామీ పథకం వేతనాలను కేంద్రం పెంచి ఉంటే, వీబీ-జీరామ్‌జీ వేతనాల్లోనూ అంతే మేర పెంపు ఉండేది.

నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభోత్సవాలు

వీబీ-జీరామ్‌జీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా ముక్కావారిపల్లిలో గురువారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హాజరవుతారు. కాగా, కార్యక్రమాల నిర్వహణపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ... అన్ని జిల్లాల కలెక్టర్లకు, డ్వామా పీడీలకు లేఖలు రాశారు. ‘జూలై 2న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఘనంగా ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి కూలీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పంచాయతీరాజ్‌ సంస్థల ప్రతినిధులు, గ్రామస్థుల భాగస్వామ్యంతో జన్‌ సమ్మేళన్‌-కమ్‌-లాంచ్‌ కార్యక్రమాలు నిర్వహించాలి. పథకం ప్రారంభమైన రోజే ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలి. ఎంపిక చేసిన గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై పనులను ప్రారంభించాలి’ అని ఆదేశించారు.

దేశ గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ: పెమ్మసాని

ప్రధాని మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దూరదృష్టి గల నాయకత్వంలో వీబీ- జీరామ్‌జీ పథకం దేశ గ్రామీణాభివృద్ధికి కొత్త దిశను చూపించబోతోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం దేశవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కావడంపై ఆయన ‘ఎక్స్‌’లో స్పందించారు. సాంకేతికత ఆధారిత పారదర్శకత, ప్రజల భాగస్వామ్యంతో ఆత్మనిర్భర గ్రామాలు- అభివృద్ధి చెందిన భారత్‌(వికసిత్‌ భారత్‌-2047) లక్ష్య సాధనలో ఈ పథకం ఒక కీలక మైలురాయిగా నిలవనుందని పేర్కొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 03:27 AM