Share News

ఉపాధి నిధుల్లో మూడో వంతు పంచాయతీలకే

ABN , Publish Date - Aug 10 , 2026 | 03:47 AM

ఉపాధి పథకం నిర్వహణ వ్యయానికి సంబంధించి కేంద్రం కీలక నిబంధనలు తీసుకొచ్చింది. వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌..

ఉపాధి నిధుల్లో మూడో వంతు పంచాయతీలకే

  • ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సాంకేతిక సిబ్బంది గౌరవ వేతనాలకు ప్రాధాన్యం

  • మొత్తం వ్యయంలో పరిపాలనా వ్యయాలు 9 శాతానికి పరిమితం

  • అంతకుమించి ఖర్చు చేస్తే అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే..

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఉపాధి పథకం నిర్వహణ వ్యయానికి సంబంధించి కేంద్రం కీలక నిబంధనలు తీసుకొచ్చింది. వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ (గ్రామీణ) (వీబీ- జీరామ్‌జీ) కింద పరిపాలనా వ్యయాలను మొత్తం వ్యయంలో 9 శాతానికి పరిమితం చేసింది. అదే సమయంలో అనుమతించే పరిపాలనా నిధుల్లో కనీసం మూడోవంతు గ్రామ పంచాయతీల స్థాయిలోనే ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. దీంతో పంచాయతీ స్థాయిలో పనిచేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సాంకేతిక, ఇతర సిబ్బందికి చెల్లించే గౌరవ వేతనాలకు ప్రాధాన్యం లభించనుంది. ఈ పథకంలో పరిపాలనా ఖర్చులకు కేంద్రం కఠినమైన పరిమితిని విధించింది. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా మొత్తం పరిపాలనా వ్యయం పథకం కింద జరిగే మొత్తం వ్యయంలో 9 శాతానికి మించకూడదు. రాష్ట్రాల వారీగా పరిపాలనా కేటాయింపులను కేంద్రం నిర్ణయిస్తుంది. ఆ పరిమితిని మించి ఖర్చు చేస్తే అదనపు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో జరిగే పరిపాలనా వ్యయాలకు కేంద్రం పూర్తిగా నిధులు సమకూరుస్తుంది. కేంద్రమండలి, జాతీయ స్థాయి కమిటీలు, జాతీయ ఈఐసీ కార్యక్రమాలు, శిక్షణ, పర్యవేక్షణ, ఐటీ వ్యవస్థల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, ఆడిటర్లు, కన్సల్టెంట్లు, నిపుణుల సేవలు, సామాజిక తనిఖీ, పరిశోధనలు, మూల్యాంకనాలు, బ్యాంకు లావాదేవీలు, ఎస్‌ఎంఎస్‌ చార్జీలు తదితరాలు ఇందులో ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో జరిగే పరిపాలనా ఖర్చులను చట్టంలో నిర్దేశించిన నిధుల భాగస్వామ్య విధానం ప్రకారం కేంద్రం, రాష్ట్రాలు పంచుకుంటాయి.


రాష్ట్రమండలి, శిక్షణ, పర్యవేక్షణ, ఐటీ నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, సిబ్బంది జీతభత్యాలు, పని ప్రదేశాల నిర్వహణ, అంబుడ్స్‌పర్సన్‌ తదితర ఖర్చులు ఇందులోకి వస్తాయి. అయితే ఈ నిబంధనల్లో కేంద్రం భరించాల్సినవి లేదా కేంద్ర-రాష్ట్రాల మధ్య పంచుకోవాల్సినవిగా పేర్కొనని వ్యయాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయి. రాష్ట్రంలో పథకం అమల్లో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషించే విధంగా చర్యలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నిబంధనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated Date - Aug 10 , 2026 | 03:48 AM