వట్టి చెరుకూరుకు విముక్తి
ABN , Publish Date - May 30 , 2026 | 04:07 AM
గుంటూరు జిల్లాలో తీపిలేని చెరుకు పంటసాగుకు ప్రసిద్ధిగాంచిన గ్రామం వట్టి చెరుకూరు. అయితే, ఇక్కడి నివాస భూములు నిషేధ జాబితా 22(ఏ)లో ఉండటం శతాబ్దానికిపైగా గ్రామస్థులకు చేదునే మిగుల్చుతోంది.
శతాబ్దం క్రితం తప్పును దిద్దిన కూటమి
గ్రామ చెరువును, నివాస భూములను కలిపి నాడు చెరువు పోరంబోకుగా పరిగణించిన బ్రిటిషర్లు
వాటిని నిషేధ జాబితాలో చేర్చిన ఉమ్మడి ఏపీ
22(ఏ) నుంచి నివాస భూములు తొలగిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు..
అమరావతి, గుంటూరు, మే 29 (ఆంధ్రజ్యోతి) : గుంటూరు జిల్లాలో తీపిలేని చెరుకు పంటసాగుకు ప్రసిద్ధిగాంచిన గ్రామం వట్టి చెరుకూరు. అయితే, ఇక్కడి నివాస భూములు నిషేధ జాబితా 22(ఏ)లో ఉండటం శతాబ్దానికిపైగా గ్రామస్థులకు చేదునే మిగుల్చుతోంది. 1906లో రీ సెటిల్‌మెంట్ రిజిస్టర్ (ఆర్‌ఎస్ఆర్) తయారీ సమయంలో జరిగిన చిన్నపొరపాటుతో 120 ఏళ్లుగా ఆ గ్రామానికి ‘విముక్తి’ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం చొరవతో శుక్రవారం ఎట్టకేలకు చెర వీడింది. వివరాలివీ.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు క్రీ.శ 1130 నాటి ప్రాచీన గ్రామం. 1931నాటికి అది పెద్ద గ్రామ పంచాయతీ. 1902-04 లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం భూముల సర్వే చేయించి.. భూముల రికార్డును రూపొందించింది. 1906లో రీ సెటిల్‌మెంట్ రిజిస్టర్ (ఆర్‌ఎస్ఆర్)ను రూపొందించారు. ఆ సమయంలో వట్టిచెరుకూరులోని సర్వేనంబర్ 241లో ఉన్న 83.01 ఎకరాల చెరువుతోపాటు, దాని పక్కనే గ్రామకంఠం భూమి 25.37 ఎకరాలను కలిపి చెరువు పోరంబోకుగా నమోదు చేశారు. ఇక అప్పటి నుంచి అది చెరువు పోరంబోకుగానే రికార్డుల్లో ఉంటోంది. మొత్తం సర్వే నంబర్‌లోని భూమిని చెరువు పోరంబోకుగానే పరిగణిస్తున్నారు. 2006లో ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములన్నిటినీ కాపాడే పేరిట గ్రామం వారీగా కీలకమైన సర్కారీ భూములను రిజిస్ట్రేషన్ చట్టం -1908లోని నిషేధ భూముల జాబితా 22(ఏ)లో చేర్చింది. ఇందులో ప్రభుత్వ, అసైన్డ్, ఇనామ్, పోరంబోకు, చెరువుపోరంబోకు, గ్రామకంఠం, చుక్కల భూముల వంటివన్నీ నిషేధ జాబితాలోకి వెళ్లాయి. అలా.. వట్టి చెరుకూరులోని నివాసభూములు సైతం నిషేధ జాబితాలోకి వెళ్లిపోయాయి. అప్పటినుంచి ఆ భూములపై క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీలు నిలిచిపోయాయి. వట్టిచెరుకూరులోని సర్వే నంబర్ 241లో ఉన్న 83.01 ఎకరాలే చెరువు.
మిగతా భూమి 25.37 ఎకరాలు అంతా నివాససయోగ్యమైనదే. ఆ భూమిలో 550 కుటుంబాలు సొంత ఇళ్లు నిర్మించుకున్నాయి. ప్రజలు ఏటేటా ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నారు. అయినా ఆ భూమి నిషేధ జాబితాలో ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇటివలి కాలంలో గ్రామస్థులు కొందరు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను సచివాలయంలో కలిసి తమ సమస్య వివరించారు. గ్రామంలోని సింహభాగమైన భూమిని నిషేధ జాబితా నుంచి తొలగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలో రెవెన్యూశాఖ...గుంటూరు జిల్లా కలెక్టర్‌ను నివేదిక కోరింది. చెరువుతో సంబంధంలేని ప్రజలు నివాసం ఉంటోన్న 25.37 ఎకరాల భూమిని ఆ సర్వే నంబర్ నుంచి వేరుచేసి దాని భూమి స్వభావం మార్చాలని, అనంతరం దాన్ని నిషేధ జాబితా నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్ ఇటీవల రెవెన్యూశాఖకు నివేదించారు. 2023లో జరిగిన రీ సర్వేలో ఈ భూమిని కొలతలు వేశారని, 241 సర్వే నంబర్‌ను విభజించి... 241-3, 241-5 పేరిటే రెండు కొత్త సర్వే నంబర్లు ఇచ్చి ఎల్‌పీఎమ్ నెం. 1101గా నమోదుచేశారని నివేదికలో పేర్కొన్నారు. దీంతో 241 సర్వే నంబర్‌లోని చెరువు, ప్రజలు నివాసం ఉంటున్న భూములను విడదీసి వాటి క్లాసిఫకేషన్‌ను మార్చాలని రెవెన్యూశాఖ నిర్ణయించింది. ఈ దిశగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి, సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు(జీఓ 314) జారీ చేశారు. వట్టిచెరుకూరు ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించిందని 120 ఏళ్ల నాటి భూమి సమస్యకు మా ప్రభుత్వం పరిష్కారం చూపించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.