Share News

రూ.20 లక్షల పరిహారం

ABN , Publish Date - Mar 01 , 2026 | 05:46 AM

వేట్లపాలెం పేలుళ్ల ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

రూ.20 లక్షల పరిహారం

  • ఆర్డీవో,డీఎస్పీ,ఫైర్‌, లేబర్‌ ఆఫీసర్ల సస్పెన్షన్‌

  • ప్రమాదంపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం

  • నిర్వాహకుల ఆస్తులు జప్తు చేస్తామని ప్రకటన

  • హుటాహుటిన వేట్లపాలేనికి చంద్రబాబు

  • సెక్యూరిటీ ప్రొటోకాల్‌ పక్కనపెట్టి పర్యటన

  • కలెక్టరు కారులోనే పేలుడు స్థలి, ఆస్పత్రికి..

కాకినాడ, అమరావతి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): వేట్లపాలెం పేలుళ్ల ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, క్షతగాత్రులకు ప్రభుత్వమే ఉచితంగా, మెరుగైన వైద్యం అందిస్తుందని తెలిపారు. ఈ ఘటనలో పర్యవేక్షణా లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని, దీనికిగాను ఆర్డీవో శ్రీరమణి, డీఎస్పీ శ్రీహరిరాజుతో పాటు జిల్లా కార్మిక శాఖ అధికారి, ఫైర్‌ ఆఫీసర్లను తక్షణం సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. పేలుడు ఘటనను సీరియ్‌సగా తీసుకున్నానని, సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నానన్నారు. నివేదిక అందిన అనంతరం మిగిలిన బాధ్యులపై కూడా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అంతకుముందు...దీనిపై ఆయన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో చర్చించారు. ఈ ఘటనలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతోనే నిబంధనల ఉల్లంఘన జరిగిందని, దాని వల్లే ఈ స్థాయి ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. వెనువెంటనే అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌తో కలిసి శనివారం రాత్రి ఘటనా స్థలిని సీఎం పరిశీలించారు. అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అన్నిరకాల మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.


అనంతరం ప్రభుత్వాస్పత్రి వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘ఇటీవల కోనసీమ జిల్లాలోని కొమరిపాలెంలో బాణసంచా కేంద్రంలో పేలుడు జరిగింది. దానిపై విచారణ జరిపించి, బాణసంచా కేంద్రాల విషయంలో ఏం చర్యలు తీసుకోవాలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేశాం. కానీ, అవి అమలు కాలేదు.కొంతమంది విచ్చలవిడి తనానికి అలవాటుపడ్డారు. ఇటువంటి వారందరిపైనా క్రిమినల్‌ చర్యలతోపాటు ప్రాసిక్యూట్‌ చేసి జీవితాంతం జైలుశిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. వారి ఆస్తులు జప్తు చేసి బాధితుల కుటుంబాలకు అందజేస్తాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. మృతులు, క్షతగాత్రుల కుటుంబాల్లో చిన్నారులను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇళ్లు కట్టించి ఇస్తాం. అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని చంద్రబాబు తెలిపారు.


అన్నీ విచారణలో తేలతాయి

బాణసంచా కేంద్రం నిర్వాహకులు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీరతామని సీఎం స్పష్టం చేశారు. సంఘటనకు గల కారణాలన్ని విచారణలో తేలతాయని తెలిపారు. ‘‘వీరికి అనుమతులు ఎలా వచ్చాయన్న అంశాలు విచారణలో పరిశీలిస్తాం. ఇక బాణ సంచా తయారీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పెట్టి వాటిని కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేస్తాం. అనుమతులు లేకుండా ఎవరైనా బాణ సంచా తయారు చేస్తే ఆస్తుల జప్తుతో పాటు క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు చెప్పారు.

ప్రొటోకాల్‌ పక్కన పెట్టి..

విజయనగరం జిల్లా పర్యటనలో ఉండగా చంద్రబాబుకు సంఘటన గురించి తెలిసింది. మరుక్షణమే ఆయన నేరుగా సామర్లకోట చేరుకున్నారు. బులెట్‌ప్రూఫ్‌ కార్లతో ఉన్న ప్రత్యేక కాన్వాయ్‌లో సీఎం స్థాయి నాయకులు పర్యటిస్తారు. అయితే, ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులకు సాధ్యమైనంత త్వరగా పరామర్శించాలనే ఉద్దేశంతో కాకినాడ జిల్లా కలెక్టర్‌ కారులోనే తన పర్యటన కొనసాగించారు. సీఎం వెంట మంత్రులు వంగలపూడి అనిత, కందుల దుర్గేశ్‌, ఎంపీలు సానా సతీశ్‌బాబు, తంగెళ్ల ఉదయశ్రీనివాస్‌, ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 05:47 AM