Share News

అంత సొమ్ము మీకెక్కడిది?

ABN , Publish Date - May 28 , 2026 | 05:00 AM

జగన్‌ హయాంలో జరిగిన భారీ మద్యం స్కాం కేసులో రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ...

అంత సొమ్ము మీకెక్కడిది?

  • ఇంత భారీగా ఆస్తులెలా కొన్నారు?

  • మద్యం స్కాంలో వాసుదేవరెడ్డికి ఈడీ ప్రశ్నలు

  • జగన్‌ పీఏ కేఎన్‌ఆర్‌కూ శ్రీముఖం

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో జరిగిన భారీ మద్యం స్కాం కేసులో రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం విచారించింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించి కీలక విషయాలు రాబట్టింది. బేవరేజెస్‌ కార్పొరేషన్లో ఆయన అడుగుపెట్టడం మొదలుకొని.. మద్యం సరఫరా సంస్థలకు ఇచ్చిన ఆర్డర్లు, భారీ మొత్తంలో జరిగిన లావాదేవీలు, లిక్కర్‌ ఆర్డర్లు మాన్యువల్‌గా మార్చడం వెనకున్న కారణాలు, ముడుపుల ఆరోపణలు, ఆయన భారీగా కొనుగోలు చేసిన ఆస్తులు, బావమరిది తదితర బంధువులను బినామీలుగా పెట్టుకుని పోగేసుకున్న ఆస్తుల చిట్టాపై నిలదీసినట్లు తెలిసింది. ఎండీగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, మద్యం ధరల పెంపు, సరఫరా సంస్థల ఎంపిక, అనుమతుల జారీ, చెల్లింపుల ప్రక్రియపైనా అడిగినట్లు సమాచారం. ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టం, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఆర్థిక లావాదేవీలు, వాసుదేవరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలించిన ఈడీ అధికారులు.. వాటిపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మద్యం వ్యాపారుల ఖాతాల నుంచి వాసుదేవరెడ్డి బంధువులకు చేరిన సొమ్ము గురించి అడిగారు. అప్పట్లో ఆయనతో పాటు ఎక్సైజ్‌ శాఖలో కీలకంగా వ్యవహరించిన అధికారుల పాత్రపైనా ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన భార్య కల్పనారెడ్డి, బంధువుల పేరుతో కొనుగోలు చేసిన రూ.96 కోట్ల విలువైన ఆస్తులకు డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించిన ఈడీ అధికారులు.. బ్లాక్‌లో చెల్లించిన పెద్ద మొత్తం తాలూకు వివరాలు రాబట్టినట్లు సమాచారం. వైసీపీ హయాంలో బీ9 బేవరేజె్‌సకు ఏడాది పాటు మద్యం ఆర్డర్‌ ఇవ్వకుండా.. ఒక్కో కేసు మద్యంపై తనకు రూ.65 నుంచి రూ.78 వరకూ లంచం ఇచ్చిన తర్వాతే వాసుదేవరెడ్డి దానికి ఆర్డర్లు ఇచ్చిన వ్యవహారంలో ఈడీ అధికారులు ఆధారాలు సంపాదించారు. వాటిని ముందుపెట్టి ఆయన్ను ప్రశ్నించినట్లు సమాచారం.


భార్య సోదరుడు విజయ నరసింహారెడ్డికి చెందిన రణదీప్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఆసీఫా మార్కెటింగ్‌ సర్వీసెస్‌, వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌, వీఎన్‌ఆర్‌ గ్లోబల్‌ వంటి సంస్థల్లోకి బీ 9 బేవరేజెస్‌ నుంచి కోట్లాది రూపాయలు వచ్చాయని.. ఆ మొత్తాన్ని దఫదఫాలుగా వాసుదేవరెడ్డి భార్య పేరుతో ఆస్తుల కొనుగోలుకు మళ్లించడంపైనా గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు తెలిసింది. పెరల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి తీసుకున్న రూ.20 కోట్ల లంచం, మద్యం డిపోల నుంచి లిక్కర్‌ షాపులకు సరుకు సరఫరా చేసే రవాణా కాంట్రాక్టు సిగ్మా అనే సంస్థకు ఎక్కువ ధరకు కట్టబెట్టి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చి లబ్ధి పొందడంపైనా ఈడీ ప్రశ్నించింది. వాసుదేవరెడ్డి, ఆయన భార్య కల్పనారెడ్డి, బావమరిది విజయనరసింహారెడ్డి, మామ పుల్లారెడ్డి, వారికి సంబంధించిన వీఎన్‌ఆర్‌ డెయిరీ ప్రొడక్ట్స్‌, వీఎన్‌ఆర్‌ గ్లోబల్‌, శ్రీ లక్ష్మీనరసింహస్వామి మిల్క్‌ చిల్లింగ్‌ పాయింట్‌ వంటి సంస్థల వ్యాపార ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము మళ్లించి.. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరంలో కొనుగోలు చేసిన రూ.49 కోట్ల విలువైన వ్యవసాయ భూమి లావాదేవీలపై ఆరా తీసినట్లు తెలిసింది. తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో కొన్న రూ.35 కోట్ల విలువైన ఆస్తి, హైదరాబాద్‌ సమీపంలోని గండిపేట ప్రాంతంలో వెన్నా బ్రీజ్‌లో కొనుగోలు చేసిన విల్లా, మరికొన్ని ఆస్తులకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయని ఈడీ అధికారులు అడిగారు. ఆయనిచ్చిన అత్యంత విలువైన సమాచారంతో గత ప్రభుత్వంలోని మరికొందరు అధికారులకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.

కేఎన్‌ఆర్‌కు నోటీసులు

ఈ మద్యం స్కాంలో గురువారం విచారణకు రావాలని జగన్‌ పీఏ కేఎన్‌ఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇదే కేసులో సిట్‌ విచారణ ఉన్నందున జూన్‌ మొదటి వారంలో వస్తానని ఆయన బదులిచ్చినట్లు సమాచారం. కేఎన్‌ఆర్‌ రూ.వందల కోట్లు ఎలా కూడబెట్టారో ఈడీ అధికారులు సమాచారం సేకరించారు. ఆస్తుల కొనుగోలు పత్రాలు, బ్యాంకు ఖాతాలు, 2019 నుంచి వరుసగా ఆదాయ పన్ను రిటర్న్‌లు తీసుకుని రావాలని ఆయనకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈడీ.. మరికొందరికి నోటీసులు జారీచేయనున్నట్లు తెలిసింది.

Updated Date - May 28 , 2026 | 05:00 AM