Share News

ఆ ఇద్దరికీ ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:17 AM

మద్యం కుంభకోణం నిందితులు ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక అధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు తిరస్కరించాలని కోరుతూ సహ నిందితుడు...

ఆ ఇద్దరికీ ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు

  • వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌కు దర్యాప్తు సంస్థ సహకరిస్తోంది

  • మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి, థర్డ్‌ పార్టీ అనుబంధ పిటిషన్ల విచారణార్హతపై ముగిసిన వాదనలు

అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం నిందితులు ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక అధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు తిరస్కరించాలని కోరుతూ సహ నిందితుడు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, థర్డ్‌ పార్టీ సువర్ణరాజు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ల విచారణార్హతపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. రాతపూర్వక వాదనలు సమర్పించేందుకు వీలుగా విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు వాసుదేవరెడ్డి(ఏ2), సత్యప్రసాద్‌(ఏ3) వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అప్రూవర్లుగా మారతామంటూ ముందస్తు బెయిల్‌ అభ్యర్థిస్తున్నారని, వారికి బెయిల్‌ మంజూరు చేయవద్దని సహ నిందితుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(ఏ38), థర్డ్‌ పార్టీ సువర్ణరాజు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు గురువారం విచారణకు రాగా వాసుదేవరెడ్డి, వెంకట సత్యప్రసాద్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కె.పరమేశ్వర్‌ జోక్యం చేసుకుంటూ థర్డ్‌ పార్టీ, సహనిందితుడు వేసిన అనుబంధ పిటిషన్లకు విచారణార్హత లేదని అన్నారు. ముందుగా అనుబంధ పిటిషన్లపై వాదన విని నిర్ణయం వెల్లడించిన తరువాత ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరపాలని కోరారు. చెవిరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ దవే వాదిస్తూ... వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌కు దర్యాప్తు సంస్థ సహకరిస్తోందని, వీరికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం, సీఐడీ అనుకూలంగా ఉన్నాయని వివరించారు. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.

Updated Date - Feb 06 , 2026 | 03:17 AM