వసూల్ రాజాలు!
ABN , Publish Date - Apr 15 , 2026 | 01:10 AM
జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంపై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు కోటరీగా ఏర్పడి ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. సచివాలయ కార్యదర్శుల పదోన్నతులు, బదిలీల నుంచి కారుణ్య నియామకాల వరకు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం జిల్లా పంచాయతీ అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా పరిస్థితి ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
- డీపీవో కార్యాలయంలో అవినీతి దందా!
- ప్రత్యేక కోటరీగా ఏర్పడిన ఉద్యోగులు
- ప్రతిపనికి రేటు నిర్ణయించి మరీ వసూలు!
- సచివాలయ కార్యదర్శుల పదోన్నతులు, బదిలీల్లో చేతివాటం
- కారుణ్య నియామకాల్లోనూ అదేతీరు
- ప్రస్తుతం ఖాళీగా జిల్లా పంచాయతీ అధికారి పోస్టు
- ఎవరికీ పోస్టింగ్ ఇవ్వకుండా తెరవెనుక చక్రం తిప్పుతున్నారనే ప్రచారం
జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంపై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు కోటరీగా ఏర్పడి ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. సచివాలయ కార్యదర్శుల పదోన్నతులు, బదిలీల నుంచి కారుణ్య నియామకాల వరకు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం జిల్లా పంచాయతీ అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా పరిస్థితి ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) పోస్టు కొద్దిరోజులుగా ఖాళీగా ఉంది. ఇప్పటివరకు డీపీవోగా పనిచేసిన అధికారి జడ్పీ సీఈవోగా బదిలీపై వెళ్లారు. దీంతో ఈ పోస్టు ఖాళీగా ఉంటోంది. రాబోయే జూన్, జూలై నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు ప్రభుత్వం నుంచి వెలువడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో రెగ్యులర్ డీపీవో లేకుండా ఎన్నికల ఏర్పాట్లు, సాధారణ పరిపాలనను ఎలా నెట్టుకొస్తారనే అంశంపై పంచాయతీ విభాగం అధికారుల్లో చర్చ జరుగుతోంది.
కార్యాలయంలో ప్రత్యేక కోటరీ!
జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ప్రతిపనికి ఒకరేటు నిర్ణయించి మరీ పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల కాలంలో వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీరాజ్ విభాగం కమిషనర్ ఆదేశాలను పక్కనపెట్టి డీపీవో కార్యాలయానికి డిప్యుటేషన్‌పై తీసుకువచ్చిన ఉద్యోగులతోపాటు, కార్యాలయంలోని ఇద్దరు, ముగ్గురు సీనియర్ ఉద్యోగులు కోటరీగా ఏర్పడి ప్రతిపనికి ఇంతరేటని నిర్ణయించి మరీ నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విజయవాడ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఓ ఉద్యోగి అన్ని వ్యవహారాల్లో చైతన్యవంతంగా ఉండి తెరవెనుక బేరాలు పెట్టి మరీ నగదు వసూలు చేస్తున్నాడని కార్యాలయ ఉద్యోగులతోపాటు, పంచాయతీలు, గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది బాహటంగానే చెప్పుకుంటున్నారు. ఇటీవల కాలంలో సచివాలయాల్లో గ్రేడ్-5 సెక్రటరీలకు గ్రేడ్-4 సెక్రటరీలుగా, గ్రేడ్-4 సెక్రటరీలకు గ్రేడ్-3 సెక్రటరీలుగా పదోన్నతులు ఇచ్చి బదిలీలు చేశారు. దీంతో పాటు కారుణ్య నియామకాల్లోనూ పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందనే విమర్శలు ఉన్నాయి. డీపీవో కార్యాలయం నుంచి పదోన్నతితో బదిలీపై వెళ్లిన ఒకరిద్దరు ఉద్యోగులతోపాటు, డిప్యుటేషన్‌పై వచ్చిన కొందరు ఉద్యోగులు నగదు వసూలు చేయడంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. సచివాలయ సెక్రటరీలను బదిలీ చేసే సమయంలో సొంత మండలంలో, సొంత గ్రామంలో పోస్టింగ్ ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నా వాటిని తోసిపుచ్చి, ఇష్టానుసారంగా కొందరికి సొంత మండలం, సొంత గ్రామాలకు బదిలీ చేశారని తెలిసింది.
సస్పెండ్ చేస్తానని బెదిరించి మరీ..
ఇటీవల కాలంలో జిల్లాలోని ఓ పంచాయతీలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం సక్రమంగా నిర్వహించడం లేదనే అంశంపై ఫిర్యాదులు అందాయి. దీంతో కీలక అధికారి సదరు పంచాయతీకి తనిఖీ పేరుతో వెళ్లారు. అక్కడి నుంచే జిల్లాస్థాయి అధికారితో మాట్లాడి ఇక్కడి పరిస్థితి ఏం బాగోలేదని, పంచాయతీ ఈవోపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చారు. దీంతో సంబంధిత పంచాయతీ ఈవో హడలిపోయారు. ఈక్రమంలో కీలక అధికారికి వెంట ఉండి నగదు లావాదేవీలు నడిపే కోటరీ సభ్యులు రంగంలోకి దిగారు. సస్పెండ్ అయిపోతావంటూ పంచాయతీ ఈవోను మరింతగా బెదిరించారు. ఏదో ఒకటి మీరే చేయాలంటూ బాధిత ఈవో వేడుకోవడంతో మచిలీపట్నం వచ్చి మాట్లాడుకోవాలని చెప్పి, అక్కడకు రప్పించి అడిగినంత ఇచ్చేవరకు సదరు ఈవోపై ఒత్తిడి తెచ్చి ఈ వ్యవహారాన్ని మరుగున పెట్టేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లాలోని అధిక అదాయం ఉన్న పంచాయతీలకు తనిఖీలకు వెళితే పైళ్ల నిర్వహణ సక్రమంగా లేదని, ఇంటి పన్నులు వసూలు చేయలేదని అనేక కారణాలు చూపి ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇదే సమయంలో ఈ అధికారి వెనుక ఉన్న కోటరీ ఎందుకొచ్చిన తలనొప్పి ఏదో ఒకటి సరిచేసుకోవచ్చుగదా అని సలహా ఇవ్వడం, తెరవెనుక మంతనాలు జరిపి అనుకున్న పని పూర్తి చేసుకోవడం పరిపాటిగా మారిందని పంచాయతీ కార్యదర్శులు చెప్పుకుంటున్నారు.
స్థానిక ఎన్నికలు వచ్చేస్తున్నాయి!
పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ఈ నెల 2వ తేదీతో ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలనలోకి పంచాయతీలు వెళ్లిపోయాయి. జూన్, జూలై నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో ఓటర్ల జాబితా తయారీ, జాబితాల ముద్రణ, ఎన్నికల సామగ్రి సిద్ధం చేయడం, పోలింగ్ బూతల గుర్తింపు, ఎన్నికల ప్రక్రియలో ఇతరత్రా అంశాలను చూసేందుకు రెగ్యులర్ డీపీవో తప్పనిసరిగా ఉండాలి. ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటి నుంచే అధికార యంత్రాంగం సమాయత్తం కావాలి. రెగ్యులర్ డీపీవో లేకపోతే ఎవరు పనులన్నింటినీ పర్యవేక్షిస్తారనే అంశంపైనా అయోమయం నెలకొంది. జిల్లాలో పనిచేస్తున్న డీడీవోలు, లేక ఎంపీడీవోలలో సీనియర్‌లలో ఒకరిని డీపీవో పోస్టులో నియమిస్తారనే ప్రచారం జరుగుతున్నా, డీపీవోగా ఎవ్వరూ రాకుండా తెరవెనుక పంచాయతీరాజ్ రాష్ట్ర ఉన్నతాధికారిపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.