వాసవీ మాత... అమరత్వానికి ప్రతీక
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:58 AM
ధర్మం కోసం నిలిచిన వాసవీ మాత అమరత్వానికి ప్రతిక అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు...
ఘనంగా ఆత్మార్పణ దినం
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి నిమ్మల
వాసవి పెనుగొండ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ధర్మం కోసం నిలిచిన వాసవీ మాత అమరత్వానికి ప్రతిక అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వాసవీ పెనుగొండలో వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించడం గర్వకారణం. పెనుగొండ పేరును వాసవీ పెనుగొండగా మార్చడం ద్వారా ఆర్యవైశ్యులపై ఉన్న ప్రేమను చాటుకున్నాం. వారి అభివృద్ధికికట్టుబడి ఉన్నాం. అమ్మవారి సందేశం ఏ కులానికో, మతానికో పరిమితం కాదు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి’ అని ఆకాంక్షించారు. తొలుత మంత్రి నిమ్మల దంపతులు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, దేవదాయ ఆర్‌జేసీ వి.త్రినాఽథరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పరేపల్లి రాకేశ్ పాల్గొన్నారు.