30 నుంచి తిరుమలలో వసంతోత్సవాలు
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:14 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30వ తేదీ నుంచి మూడురోజుల పాటు వసంతోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 30న ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు.
ఇంటర్నెట్ డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30వ తేదీ నుంచి మూడురోజుల పాటు వసంతోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 30న ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ వసంతోత్సవ అభిషేకం, నివేదనలు పూర్తయ్యాక తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండో రోజున మలయప్పస్వామి ఉదయం 8 నుంచి 10 గంటలకు వరకు బంగారు రథాన్ని అధిరోహించి, తిరుమాడవీధుల్లో ఊరేగుతారు. తర్వాత వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామితోపాటు సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి దర్శనమివ్వనున్నారు. ఈసందర్భంగా ప్రతి రోజూ మఽధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు తిరుమంజనం నిర్వహించనున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీవరకు కల్యాణోత్సవం, ఊంజల్, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవ, మార్చి 31న అష్టదళపాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.