రేపటి నుంచి శ్రీశైలంలో వరుణయాగం
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:24 PM
అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగం కలగలసిన శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం నుంచి వరుణయాగ సహిత సహస్త్ర ఘటాభిషేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు, పాలకమండలి చైర్మన పోతుగుంట రమేష్ నాయుడు వెల్లడించారు.
ఐదు రోజుల పాటు సహస్త్ర ఘటాభిషేకం, పంచాహ్నిక దీక్షలు
శ్రీశైలం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగం కలగలసిన శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం నుంచి వరుణయాగ సహిత సహస్త్ర ఘటాభిషేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు, పాలకమండలి చైర్మన పోతుగుంట రమేష్ నాయుడు వెల్లడించారు. ఉభయ తెలుగు రాషా్ట్రల్లో విస్తారంగా వర్షాలు కురిసి రైతాంగం, పాడిపంటలు సమృద్ధిగా, సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో ఐదు రోజులపాటు పంచాహ్నిక దీక్షలతో కూడిన వరుణయాగాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకల్లో భక్తులు కూడా పాల్గొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. 7,8 తేదీల్లో రోజున గణపతిపూజ, రుత్విగరణము, వరుణ పారాయణలు, వరుణజపం, పంచాక్షరీజప కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 9న ఆదివారం యాగశాల ప్రవేశం, శివసంకల్పం, చండీశ్వరపూజ, ఘటశుద్ధి, రుద్రపారాయణలు జరుగుతాయి. 10న సోమవారం ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలు, సహస్త్ర ఘటార్చన, చక్రార్చన, అభిషేకాలు జరుగుతాయి. ప్రధాన ఘటములతో మల్లికార్జున స్వామివారికి పంచామృతాభిషేకాలు జరుగుతాయి. 11న మంగళవారం పూర్ణాహుతితో వరుణయాగ సహిత సహస్త్ర ఘటాభిషేక పూజా కార్యక్రమాలు ముగుస్తాయి.
శ్రీశైలంలో ఆర్జిత సేవల తాత్కాలిక నిలుపుదల
శ్రీశైల మహాక్షేత్రంలో వరుణయాగ సహిత సహస్త్ర ఘటాభిషేకం సందర్బంగా ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు, పాలకమండలి చైర్మన పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, ఈనెల 9 నుంచి 11 వరకు స్వామివారి స్పర్శ దర్శనాలతోపాటు ప్రత్యక్ష మరియు పరోక్ష ఆర్జిత సేవలైన గర్బాలయ, సామూహిక అభిషేకాలు, గణపతిహోమం, రుద్రహోమం, మృత్యుంజయహోమం, అమ్మవారికి కుంకుమార్చనలు, చండీహోమం, వృద్ధమల్లికార్జున స్వామివారి అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మంగళవారం 11వతేది రాత్రి మాత్రమే స్వామి వారి స్పర్శ దర్శనభాగ్యం ఉంటుందన్నారు.