Tirumala: రెండో రోజూ సాఫీగా వైకుంఠ ద్వార దర్శనాలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:15 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా బుధవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రశాంత వాతావరణంలో భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం చేసి ఆనందపరవశులయ్యారు.
ఏకాదశి రోజు 67,053 మందికి శ్రీవారి దర్శనం
తిరుమల, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా బుధవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రశాంత వాతావరణంలో భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం చేసి ఆనందపరవశులయ్యారు. తొలిరోజు తరహాలోనే రెండో రోజూ స్లాటెడ్ భక్తులు క్యూలైన్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా శ్రీవారి దర్శనంతో పాటు వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. సాయంత్రం 6 గంటల సమయానికి 51 వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక, కొండపై భక్తుల రద్దీ మోస్తరుగానే ఉంది. శ్రీవారి ఆలయం మినహా మిగిలిన ప్రాంతాల్లో భక్తులు పలుచగానే కనిపించారు. ద్వాదశి సందర్భంగా మంగళవారం వేకువజామున చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవమూర్తుల తరపున శఠారి వరాహస్వామి మండపానికి చేరుకోగా, సుదర్శన చక్రత్తాళ్వార్లకు చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కాగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం 67,053 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. గతేడాది వైకుంఠ ఏకాదశి రోజుతో పోలిస్తే 6,959 మంది ఎక్కువగానే శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అలాగే 16,301 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.