Share News

సాక్షాత్తూ అన్నపూర్ణే డొక్కా సీతమ్మ

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:38 AM

అపర అన్నపూర్ణగా ప్రసిద్ధి గాంచిన డొక్కా సీతమ్మ నివాసంలోకి రాగానే ఒళ్లు పులకరించిందని సినీ రచయిత, ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్రప్రసాద్‌ అన్నారు.

సాక్షాత్తూ అన్నపూర్ణే డొక్కా సీతమ్మ

  • ప్రముఖ సినీ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్‌

పి.గన్నవరం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): అపర అన్నపూర్ణగా ప్రసిద్ధి గాంచిన డొక్కా సీతమ్మ నివాసంలోకి రాగానే ఒళ్లు పులకరించిందని సినీ రచయిత, ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్రప్రసాద్‌ అన్నారు. సాక్షాత్తూ అన్నపూర్ణ తల్లియే సీతమ్మగా వచ్చిందన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకన్న, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను విజయేంద్రప్రసాద్‌ సోమవారం సందర్శించారు. వీటితోపాటు పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలోని డొక్కా సీతమ్మ నివాసాన్ని సందర్శించారు. స్థానిక పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి సీతమ్మ చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మీ రచనలు, సినీ కథల్లో సీతమ్మ జీవిత చరిత్రతో ఓ పాత్రను సృష్టించే ఆలోచన ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఇప్పుడిప్పుడే ఆ ఆలోచన వస్తోందని, ఆ తల్లి కోసం ఏదైనా చేయాలని చెప్పారు. అన్నార్తుల ఆకలి తీర్చడమే ముఖ్యమనుకుని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాన్ని చేసుకోలేకపోయిన చరిత్రను విజయేంద్రప్రసాద్‌ గుర్తుచేశారు. అంతర్వేదిలో కొత్త అద్దం తీసుకుని ఆ అద్దాన్ని శ్రీలక్ష్మీనరసింహస్వామికి చూపించి అదే అద్దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి సీతమ్మ నివాసంలో ఆమె చిత్రపటానికి చూపారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ.. ఇలాగైనా సీతమ్మకు స్వామిని చూపిద్దామని ప్రయత్నం చేశానని బదులిచ్చారు.

Updated Date - Feb 10 , 2026 | 04:39 AM