Share News

విద్యార్థుల మెడలో చెప్పుల దండ

ABN , Publish Date - Mar 08 , 2026 | 06:55 AM

స్కూల్‌కి యూనిఫాం, బూట్లు వేసుకురాలేదని.. విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేసి శిక్ష విధించిన ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ నిర్వాకం ఇది.

విద్యార్థుల మెడలో చెప్పుల దండ

  • షూ వేసుకురానందుకు శిక్షవేసిన ప్రిన్సిపాల్‌

  • ఉయ్యూరు ప్రైవేటు స్కూల్‌లో ఘటన

  • విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు

ఉయ్యూరు, మార్చి 7(ఆంధ్రజ్యోతి): స్కూల్‌కి యూనిఫాం, బూట్లు వేసుకురాలేదని.. విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేసి శిక్ష విధించిన ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ నిర్వాకం ఇది. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని శ్రీవిజయసాయి ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు.. శుక్రవారం బూట్లు, యూనిఫామ్‌ లేకుండా స్కూల్‌కు హాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపాల్‌ వారు వేసుకుని వచ్చిన చెప్పులకు తాడు కట్టించి వారి మెడల్లోనే వేయించారు. ఈ విషయమై ఒక విద్యార్థి తండ్రి శనివారం జిల్లా విద్యాశాఖాధికారికి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాలని డీవైఈఓ పద్మారాణి, ఎంఈఓ దుర్గాసాగర్‌ను డీఈవో ఆదేశించారు. శనివారం వారిద్దరూ పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్‌ యాజమాన్యాన్ని విచారించారు. విచారణ నివేదికను జిల్లా విద్యాశాధికారికి అందజేస్తామని డీవైఈఓ పద్మారాణి చెప్పారు.

క్రమశిక్షణ కోసమే: కె.కనకలక్ష్మి, ప్రిన్సిపాల్‌

విద్యార్థులకు క్రమశిక్షణ నే ర్పాలన్న ఉద్దేశంతోనే అలా చేశాను. ఎవరినీ కించపరచాలని కాదు. యూనిఫాం, బూట్లు వేసుకోకుండా స్కూలుకు వస్తున్నవారిని భయపెట్టి, పనిష్మెంట్‌ ఇచ్చి క్రమశిక్షణ నేర్పించాలని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కోరిన మేరకు ఈవిధంగా చేశాను.

Updated Date - Mar 08 , 2026 | 06:55 AM