అణు రియాక్టర్ పరిశోధనకు అమెరికా ప్రోత్సాహం
ABN , Publish Date - Jun 16 , 2026 | 03:57 AM
అణు రియాక్టర్ల షీల్డ్ వాల్ నిర్మాణంలో పగుళ్ల నివారణ పరిశోధనలకు ప్రోత్సాహం అందించడానికి అమెరికా ముందుకొచ్చిందని ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ సాలిడ్ వేస్ట్ రిసెర్చ్ అండ్ ...
ఇన్‌స్వారెబ్ డైరెక్టర్లు భానుమతి, కాళిదాసు
విశాఖపట్నం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): అణు రియాక్టర్ల షీల్డ్ వాల్ నిర్మాణంలో పగుళ్ల నివారణ పరిశోధనలకు ప్రోత్సాహం అందించడానికి అమెరికా ముందుకొచ్చిందని ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ సాలిడ్ వేస్ట్ రిసెర్చ్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్’ (ఇన్‌స్వారెబ్) డైరెక్టర్లు కాళిదాసు, భానుమతి వెల్లడించారు. విశాఖపట్నంలో సోమవారం మీడియా సమావేశంలో వారు మట్లాడుతూ... ఇటీవల షీల్ట్ వాల్‌లో పగుళ్లపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని, అందులో వినియోగించే సిమెంట్ కాంక్రీట్‌లో క్రిస్టలైన్ అనే పదార్థం ఎమార్ఫ్‌సగా రూపాంతరం చెందడం వల్ల అంతర్గత వ్యాకోచం జరిగి పగుళ్లు వస్తున్నాయని తేలిందని చెప్పారు. ఫ్లైయాష్ వంటి వ్యర్థాలలో ఉన్న ఎమార్ఫ్‌సను వినియోగించి సిమెంట్ కాంక్రీట్ మన్నిక పెంచవచ్చని తమ పరిశోధనల్లో తేలిందన్నారు. అమెరికన్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ ఇటీవల విశాఖపట్నం వచ్చినప్పుడు ఆమెను కలిసి పరిశోధన పత్రాలు, ప్రతిపాదనలు సమర్పించామన్నారు. ఆమె తమను అమెరికాకు ఆహ్వానించారని, అక్కడికి కూడా వెళ్లి తమ ఆలోచనలు పంచుకున్నామని తెలిపారు. అమెరికాలోని ఏదైనా యూనివర్సిటీతో కలిసి పనిచేస్తే పరిశోధనలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇర్రేడియేషన్ పరిశోధనలకు అవసరమైన అణు రియాక్టర్ ‘ఇదాహో నేషనల్ లేబొరేటరీ’లో ఉందని తెలిసిందని, ఆ సంస్థతో అనుబంధం కలిగిన యూనివర్సిటీని సంప్రదించి, ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు లీసుకెళ్లనున్నామని వివరించారు. తమ పరిశోధనకు పేటెంట్ కూడా తీసుకున్నామని కాళిదాసు తెలిపారు.