భూముల మార్కెట్ విలువలు పెంపు
ABN , Publish Date - Jan 21 , 2026 | 04:01 AM
రాష్ట్రంలోని పట్టణప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. మార్కెట్ ధరలు, డిమాండ్‌కు అనుగుణంగా సవరించిన భూముల మార్కెట్ ధరలను ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు...
పట్టణ ప్రాంతాల్లో 1 నుంచి అమల్లోకి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది రెండోసారి
అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. మార్కెట్ ధరలు, డిమాండ్‌కు అనుగుణంగా సవరించిన భూముల మార్కెట్ ధరలను ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ అనుమతిచ్చారు. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీకి ఆయన మంగళవారం మెమో జారీచేశారు. అలాగే రెండు నెలల్లో భూముల మార్కెట్ విలువల సవరణ వ్యవస్థను ఆధునికీకరించాలని ఆదేశించారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూముల మార్కెట్ విలువలు పెంచడం ఇది రెండోసారి. గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువలను పెంచింది. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ మార్కెట్ విలువలతో పోలిస్తే తగ్గినట్లు ప్రకటించింది. గత ఏడాది కొత్త జిల్లా కేంద్రాలు, వాణిజ్యప్రాంతాల్లో భూముల విలువలు 15 నుంచి 25 శాతం వరకు పెరిగాయి. కొత్త జిల్లాల ఏర్పాటు, మౌలికసదుపాయాల కల్పన, వాస్తవ మార్కెట్ విలువలకు, ప్రభుత్వ నమోదు విలువలకు మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గించడం కోసం ధరలు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వానికి రాబడి.. భూముల మార్కెట్ విలువలు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ద్వారా ఖజానాకు రూ.13,150 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. నవంబరు నాటికి రూ.7,132 కోట్లు వచ్చినట్లు కాగ్ వెల్లడించింది. సాధారణంగా ప్రభుత్వాలు చట్టప్రకారం ఎప్పటికప్పుడు భూముల మార్కెట్ విలువలు పెంచుతూ ఉంటాయి. నగరాలు, పట్టణాల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల భూములకు డిమాండ్ పెరుగుతుంది. అలాగే బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ధరలను కొంతమేర మెరుగుపరచాలన్న ఉద్దేశంతో భూముల విలువలను ప్రభుత్వాలు పెంచుతాయి. దీనివల్ల రిజిస్ర్టేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీల రూపంలో ఆదాయం పెరుగుతుంది.