పట్టణాభివృద్ధే ప్రధాన ధ్యేయం
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:53 PM
కూటమి ప్రభుత్వ హయాంలో నందికొట్కూరు పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి మొల్లా సాబేరున్నిసా అన్నారు.
మున్సిపల్ చైౖర్పర్సన్ అభ్యర్థి మొల్లా సాబేరున్నిసా
నందికొట్కూరు, అక్టోబరు 27 (ఆంధ్ర జ్యోతి) : కూటమి ప్రభుత్వ హయాంలో నందికొట్కూరు పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి మొల్లా సాబేరున్నిసా అన్నారు. మంగళవారం పట్ట ణంలోని 5, 14, 24, 8 వార్డుల్లో ఆయా టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మాండ్ర శివానందరెడ్డిలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. అక్కా తల్లికి వందనం వస్తుందా...? అవ్వాతాత పింఛన్ వస్తుందా...? ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి .. పట్టణంలో టీడీపీ గెలిచిన వెంటనే వాటిని పరిష్కరిస్తాని హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు. సాబేరున్నిసా, కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉందని, పట్టణంలో కూడా టీడీపీని గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్ సర్కారు అభివృద్ధిని పరుగులు తీయిస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రూ.5కే పేదలకు అన్న క్యాంటీన్లో భోజనం, పింఛన్లు, తల్లికి వందనం, పట్టణాబివృద్ధికి రూ.210 కోట్లకు పైగా నిధులు కేటాయించారని తెలిపారు. శాశ్వత తాగునీటి పథకాన్ని తీసుకువచ్చామన్నారు.
గత ఐదేళ్లలో అభివృద్ధి శూన్యం : వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. 24వ వార్డు టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి, టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి సాబేరున్నిసాకు మద్దతుగా మాండ్ర శివానందరెడ్డి చౌడేశ్వరి దేవి ఆలయం నుంచి ఊరేగింపుగా ఇంటింటి ప్రచారం చేశారు. పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 2014-19 కాలంలో తలపెట్టిన పనులను నిలిపివేసిన ఘనత వైసీపీపే దక్కుతుందని ఎద్దేవా చేశారు. నేడు ఆ పనులను రూ.129 కోట్లతో ప్రారంభిస్తే జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి పార్టీని, నాయకులను ఓటుతో తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తల్లి కోసం కూతురు ప్రచారం: నందికొట్కూరు మున్సిపల్ చైర్పర్సన్ టీడీపీ అభ్యర్థి సాబేరున్నిసా గెలుపు కోసం కూతురు ఇంటింటి ప్రచారం చేస్తోంది. ముందు తల్లి సాబేరున్నిసా టీడీపీకి రెండు ఓట్లు వేయాలంటూ ప్రచారం చేశాక, టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఓటరు మనస్సును చూరగొంటోంది.