Share News

అకాల వర్షం..రైతుకు నష్టం

ABN , Publish Date - Mar 19 , 2026 | 05:58 AM

అకాల వర్షం రాష్ట్రంలో రైతులకు నష్టం కలిగించింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ పిడుగులతో వర్షాలు కురిశాయి. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీచాయి...

అకాల వర్షం..రైతుకు నష్టం

  • గాలివాన, పిడుగుల బీభత్సం

  • దెబ్బతిన్న అరటి, మామిడి, మొక్కజొన్న, మినుము పంటలు

  • అమరావతిలో 9 సెం.మీ. వర్షం

  • నేడూ, రేపూ పిడుగుల వానలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

అకాల వర్షం రాష్ట్రంలో రైతులకు నష్టం కలిగించింది. బుధవారం మధ్యాహ్నం తర్వాత కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ పిడుగులతో వర్షాలు కురిశాయి. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. గుంటూరు జిల్లా అమరావతిలో తొమ్మిది సెంమీ వర్షపాతం నమోదైంది. గుంటూరు, కృష్ణా, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి, బుధవారం సాయంత్రం కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. మొక్కజొన్న, అరటి, మామిడి పంటలు బాగా దెబ్బతిన్నాయి. కళ్యాణదుర్గం, బెళుగుప్ప, కూడేరు, ఆత్మకూరు, గార్లదిన్నె మండలాల్లో 67 ఎకరాల్లో రూ.1.95 కోట్ల విలువైన అరటి, 59 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో గంటపాటు భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. తలమరలో ఇళ్లలోకి నీరు చేరింది. కొత్తచెరువులో వడగండ్ల వాన కురిసింది. బుక్కపట్నంలో వడగండ్ల వానకు మామిడి పిందెలు రాలిపోయాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అపరాలసాగు కోత దశలో ఉండగా కురిసిన వర్షంతో మినుము.పెసర పంటలు దెబ్బతిన్నాయి. మామిడి చెట్లకూ నష్టం జరిగింది. పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం రాచూరులో మహిళా కౌలురైతు పెరవలి వనజ(35) పొలంలో కోతలు కోస్తుండగా పిడుగు పడటంతో మరణించారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కొత్తనాగిరెడ్డిపల్లిలో మహిళా కూలీ పాటూరి సుబ్బరత్తమ్మ(55) మిర్చి పొలంలో కోతలకు వెళ్లి పిడుగు పడి మరణించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో బీఎ్‌సఆర్‌ కంపెనీలో సర్వేయర్‌ మేనేజర్‌గా పని చేస్తున్న కొయ్య శ్రీనివాసరావు(40) కూడా పిడుగు పాటుకు మరణించారు. కాగా.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అధికపీడనం ప్రభావంతో తేమగాలులు భూఉపరితలంపైకి వీస్తున్నాయి. గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ నుంచి తమిళనాడు మీదుగా కర్ణాటక వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. మరోవైపు కొద్దిరోజులుగా ఎండ తీవ్రతకు భూమి వేడెక్కింది. వీటన్నింటి ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని రాష్ట్రంలో అనేకచోట్ల బుధవారం ఉరుములు, మెరుపులు, పిడుగులు, భారీ గాలులతో వర్షాలు కురిశాయి. గురు, శుక్రవారాలు ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారి సముద్రాల జగన్నాథకుమార్‌ తెలిపారు.

Updated Date - Mar 19 , 2026 | 05:58 AM