Share News

అకాల వర్షం

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:06 AM

రం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఊహించని విధంగా వర్షం పడింది. హనుమాన్‌జంక్షన్‌, బాపులపాడు తదితర ప్రాంతాల్లో బలమైన గాలులతోపాటు భారీ వర్షం కురిసింది. దీంతో రహ దారులపై వర్షపునీరు నిలిచిపోయింది. ఈ నెల 9వ తేదీ వరకు కోస్తా తీరం వెంబడి పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ సోమవారం హెచ్చరికలు జారీ చేసింది.

అకాల వర్షం

- బాపులపాడు, గుడివాడలో కుండపోత

- రహదారులపై నిలిచిపోయిన నీరు

- మామిడికి కోలుకోలేని దెబ్బ

- మొక్కజొన్న రైతుల్లో ఆందోళన

-9వ తేదీ వరకు కోస్తాతీరం వర్షం కురిసే అవకాశం

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఊహించని విధంగా వర్షం పడింది. హనుమాన్‌జంక్షన్‌, బాపులపాడు తదితర ప్రాంతాల్లో బలమైన గాలులతోపాటు భారీ వర్షం కురిసింది. దీంతో రహ దారులపై వర్షపునీరు నిలిచిపోయింది. ఈ నెల 9వ తేదీ వరకు కోస్తా తీరం వెంబడి పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ సోమవారం హెచ్చరికలు జారీ చేసింది. వేసవి కాలంలో అకాల వర్షం కురవడంతో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంటకు ఇబ్బంది ఏర్పడుతుందని రైతులు అంటున్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి కుప్పల నూర్పిడికి అంతరాయం ఏర్పడుతుందని, కూరగాయల తోటలు, తదితర పంటలు దెబ్బతింటాయనే భయం రైతులను వెంటాడుతోంది.

మామిడికి తీరని నష్టం

బాపులపాడు మండలంలోని మామిడి తోటల్లో కాయలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. బలమైన గాలులు వీయడంతో మామిడి కాయలు రాలిపోయాయి. దీంతో పంట దిగుబడి తగ్గిపోతుందని రైతులు భయపడుతున్నారు. బాపులపాడు మండలంలోని మల్లవల్లి, రేమల్లె, రంగన్నగూడెం, కొత్తపల్లి గ్రామాల్లోని మామిడి తోటల్లో మరో వారంరోజుల్లో మామిడి కాయలు కోత కోసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో వర్షానికి తోడు బలమైన గాలులు వీయడంతో మామిడి కాయలు రాలిపోయాయని రైతులు చెబుతున్నారు. మొక్కజొన్న కోతకు సిద్ధంగా ఉండగా, సోమవారం కురిసిన వర్షం కారణంగా సగానికి సగం దిగుబడులు తగ్గిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షం తాకిడికి పొగాకు సాగు చేసిన పొలాల్లో నీరు నిలబడిపోయింది. గుడివాడలో వర్షం కురవడంతో రహదారులపై నీరు నిలిచిపోయింది. నందివాడ మండలంలో తేలికపాటి వర్షం కురిసింది.

లంక భూముల్లో ఉరుకులు పరుగులు

కృష్ణానది పరివాహక ప్రాంతంలోని తోట్లవల్లూరు. కంకిపాడు, ఉయ్యూరు, శ్రీకాకుళం, తదితర ప్రాంతాల్లోని లంక భూముల్లో సాగు చేసిన మొక్కజొన్న కోతకు సిద్ధంగా ఉంది. కొంతమేర మొక్కజొన్న కోసి ఉంది. కోసిన మొక్కజొన్న పొలాల్లో గుట్టలుగా ఉన్నాయి. వర్షం కురిస్తే మొక్కజొన్న పొత్తులు తడిచి మొక్కమొలిచే అవకాశం ఉండటంతో రైతులు వీటిని భధ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రానున్న మూడు రోజులపాటు కోస్తాతీరం వెంబడి వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో రైతులు పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పరుగులు పెడుతున్నారు.

Updated Date - Apr 07 , 2026 | 12:06 AM