Share News

అకాల వర్షం

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:32 AM

రబీ సీజన్‌లో మినుము కోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ అకస్మత్తుగా బుధవారం కురిసిన వర్షం రైతన్నలను పరుగులు పెట్టించింది. వర్షానికి తడవకుండా పంటను కాపాడుకొనేందుకు పడరానిపాట్లు పడాల్సి వచ్చింది. జిల్లాలోని కంకిపాడు, ఉయ్యూరు, గుడివాడ, గుడ్లవల్లేరు, తోట్లవల్లూరు, పామర్రు తదితర ప్రాంతాల్లో ఒకమోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ నెల 20వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

అకాల వర్షం

- జిల్లాలో 1.24 లక్షల హెక్టార్లలో మినుము, పెసర సాగు

- వర్షంతో పరుగులు పెట్టిన రైతులు

- తడిచిన పనలపై ఉన్న పంట

- ధరపై ప్రభావం చూపుతుందని రైతుల్లో ఆందోళన

రబీ సీజన్‌లో మినుము కోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ అకస్మత్తుగా బుధవారం కురిసిన వర్షం రైతన్నలను పరుగులు పెట్టించింది. వర్షానికి తడవకుండా పంటను కాపాడుకొనేందుకు పడరానిపాట్లు పడాల్సి వచ్చింది. జిల్లాలోని కంకిపాడు, ఉయ్యూరు, గుడివాడ, గుడ్లవల్లేరు, తోట్లవల్లూరు, పామర్రు తదితర ప్రాంతాల్లో ఒకమోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ నెల 20వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

జిల్లాలో ఈ రబీ సీజన్‌లో 1.24 లక్షల హెక్టార్లలో మినుము, పెసర పంటలను సాగు చేశారు. ప్రస్తుతం మినుముతీత పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మినుము, పెసర పంటలు కోసి పనలపై ఉంది. మరికొంత గుట్టలుగా వేసి ఉంచారు. ఇప్పట్లో వర్షం కురవదనే ధైర్యంతో మినుము పంటను ఆరబెట్టే పనుల్లో రైతులు ఉన్నారు. కంకిపాడు, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో 20 మిల్లీమీటర్ల కంటే అధికంగా వర్షం కురవడంతో పనలపై, గుట్టలుగా పెట్టి ఉన్న పంట తడిచి ముద్దయింది. గురువారం కూడా వర్షం కురిస్తే గుట్టలపై ఉన్న మినుము పంట మరింతగా తడిచి రంగు మారుతుందని రైతులు చెబుతున్నారు. తడిచిన పంటను ఆరబెట్టే సమయంలో కాయలు పగిలి గింజలు రాలిపోతాయని ఆందోళన చెందుతున్నారు. పెసలు ఒక్కరోజు వర్షానికే తడిచి మొలకెత్తుతాయని, పెసర పంటకు తీరని నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. గుట్టలపై ఉన్న మినుముపైరు తడిచిన కారణంగా బూజు పడుతుందని, దీంతో ఎంతశాతం మేర పంట నష్టం జరుగుతుందో ఇప్పుడే అంచనా వేయలేమని అంటున్నారు. కంకిపాడు తదితర ప్రాంతాల్లోని పొలాల్లో నీరు చేరిందని, దీంతో బస్తాలలోకి ఎత్తి ఉంచిన మినుమును బయటకు తెచ్చేందుకు అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. కోత కోయకుండా ఉన్న మినుముకు పెద్దగా నష్టం ఉండదని, కోత కోసిన తర్వాత పనలపై, గుట్టలుగా పెట్టి ఉన్న మినుముకు నష్టం జరగడం ఖాయమని రైతులు అంటున్నారు.

తడిచి ముద్దయిన పసుపు, మిర్చి

తోట్లవల్లూరు మండలంలోని లంక భూముల్లో పసుపును తీసి ఉడకబెట్టిన అనంతరం రైతులు ఎండబెట్టారు. కల్లాల్లో ఆరబెట్టినపసుపు వర్షానికి తడవ డంతో రంగు మారిపోతుందని రైతులు చెబుతున్నారు. మిర్చి కల్లాల్లో ఆరబెట్టి ఉంచామని, ఊహించని విధంగా వర్షం కురవడంతో పొలాల వద్దకు వెళ్లి మిర్చిని గుట్టలుగా పెట్టేందుకు సమయం చాలలేదని రైతులు వాపోతున్నారు.

మినుము ధర తగ్గించి మరీ కొనుగోలు

మినుము క్వింటాలుకు మద్దతు ధర రూ.7,800గా ప్రభుత్వం ప్రకటించింది. మినుము తీతలు ప్రారంభమైనప్పుటి నుంచి క్వింటా మినుము ధర మద్దతు ధరతో సంబంధం లేకుండా వ్యాపారులు రూ.9.300 వరకు కొనుగోలు చేశారు. మినుము తీత పనులు వేగవంతమైన కొద్దీ ధరను తగ్గిస్తూ వస్తున్నారు. మంగళవారం వరకు క్వింటా మినుము రూ.8,350 కొనుగోలు చేశారు. బుధవారం వర్షం కురవడంతో రూ. 8వేలకు ధరను తగ్గించి వేశారని రైతులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా మరింతగా వర్షం కురిస్తే రానున్న రోజుల్లో వ్యాపారులు ఎంతమేర మినుము ధర తగ్గిస్తారనే అంశంపై రైతులు చర్చించుకుంటున్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:32 AM