Share News

ఆగని వాన.. తీరని కష్టం

ABN , Publish Date - Mar 20 , 2026 | 04:52 AM

వరుసగా రెండో రోజూ అకాల వర్షాలు కురవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. గురువారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు...

ఆగని వాన.. తీరని కష్టం

  • వరుసగా రెండో రోజూ అకాల వర్షాలు

  • రాలిపోయిన మామిడి పిందెలు, నిమ్మకాయలు

  • నేలవాలిన వరి, అరటి, మినుము, మొక్కజొన్న

  • ఇతర పంటలకూ వాటిల్లిన నష్టం

  • అల్లూరి జిల్లా చింతపల్లిలో వడగళ్ల వాన

  • మరో 3 రోజులు వర్షాలు?

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

వరుసగా రెండో రోజూ అకాల వర్షాలు కురవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. గురువారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిశాయి. గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి, జి.మాడుగులలో వడగళ్లు పడ్డాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గురువారం కురిసిన మోస్తరు వర్షాలకు మొక్కజొన్న, మినుము, పెసర పంటలు మళ్లీ తడిచాయి. తడిచిన కారణంగా కాయలు రాలిపోతాయని, మినుము రంగుమారిపోతుందని, గింజలు రంగు మారిపోతాయని, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాల్లో మొక్కజొన్న పంట నేలవాలింది. లంక భూముల్లో కోత అనంతరం ఆరబెటట్టిన మిర్చిపంట, ఉడకబెట్టి ఆరబోసిన పసుపు తడిచిపోయాయి. నెల్లూరు జిల్లాలో బుధ, గురువారాల్లో రాత్రిపూట కురిసిన వర్షాలకు కోతకు వచ్చిన వరి పైరు దెబ్బతినగా, మామిడి పూత, పిందెలు నేలరాలాయి. రాపూరు మండలం గోనుపల్లిలో వడగండ్ల వానకు దాదాపు 100 ఎకరాలకుపైగా వరి నేలవాలింది. రాంకూరు, గరిమెనపెంట గ్రామాల్లోని 100 ఎకరాల్లో మామిడి తోటల్లోని పూత, పిందె నేలరాలింది. నిమ్మ తోటల్లో పండ్లు రాలిపోయాయి. అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లి, లింగంగుంట, మంగుపలి,్ల కామిరెడ్డిపాడు, అనంతసాగరం గ్రామాల్లో వరి దెబ్బతినగా, గుడిగుంట, గౌరవరం, గుడిగుంట గ్రామాల్లో మిరప, బొప్పాయి, పత్తి మెట్ట పైర్లు దెబ్బతిన్నాయి.

Untitled-2 copy.jpg


కొండాపురం, జలదంకి మండలాల్లో వరి కోతలు పూర్తి చేసిన రైతులు గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం రాశులను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతపురం జిల్లాలో రైతులకు రూ.1.29 కోట్ల పంటనష్టం వాటిల్లినట్టు అంచనావేశారు. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఎర్రోనిపల్లిలో వడగండ్ల వానకు కర్బూజ పంట ధ్వంసమైంది. తిరుపతి జిల్లాలో 1070 ఎకరాల్లో అరటి, వరి, తమలపాకు పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు సుమారు రూ.10.25 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. బాపట్ల జిల్లాలో గురువారం జల్లులు కురవడంతో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చిని కాపాడుకోడానికి రైతులు శ్రమించాల్సి వచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో గురువారం వడగళ్లు పడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. పూత, పిందె దశలో ఉన్న మామిడి పంటకు నష్టం వాటిల్లింది. కాపు దశలో ఉన్న జీడిమామిడి సైతందెబ్బతిందని రైతులు చెబుతున్నారు.


నేడు విస్తారంగా పిడుగుల వానలు

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులతో వర్షాలు పడతాయని, గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 23 వరకు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, శుక్రవారం రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం కోస్తాలో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.

Updated Date - Mar 20 , 2026 | 04:54 AM