నిర్లక్ష్యపు ‘నిప్పు’.. మళ్లీ మళ్లీ మండుతోంది
ABN , Publish Date - Mar 01 , 2026 | 05:37 AM
సరిగ్గా అయిదునెలల కిందట కోనసీమ జిల్లా రాయవరం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడుతో పదిమంది వరకు సజీవ దహనమయ్యారు.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో నిత్య ప్రమాదాలు
ఉమ్మడి తూ.గో. జిల్లాలో నిత్య ప్రమాదాలు
తక్కువ కూలికి మహిళలు, పిల్లలతో తయారీ
మామూళ్ల మత్తులో రెవెన్యూ, పోలీసు, ఫైర్
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
సరిగ్గా అయిదునెలల కిందట కోనసీమ జిల్లా రాయవరం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడుతో పదిమంది వరకు సజీవ దహనమయ్యారు. 2014 అక్టోబరులో పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో ఏకంగా 18మంది మృతిచెందారు. ప్రమాదం జరిగాక రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహం... అధికారుల హడావుడి! అంతా రెండురోజులే! ఆ తర్వాత అంతా మామూలే! ఇప్పుడు వేట్లపాలెంలో మరో పెను విషాదం! రాష్ట్రం మొత్తంలో ఎనభై శాతం మందుగుండు తయారీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే జరుగుతుంది. కొమరిపాలెం, వేట్లపాలెం, ద్రాక్షారామం, గొల్లప్రోలు, పెదపూడి మందుగుండు తయారీ కేంద్రాలకు బాగా పేరు. దాదాపు ఎనభై ఏళ్లుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బాణసంచా తయారీ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహాలు, రాజకీయ సభలు, జాతర్లు, తీర్థాలు, పండగలు ఏవైనా భారీస్థాయిలో బాణసంచా మోత మోగాలంటే ఇక్కడి నుంచి సరుకు వెళ్లాల్సిందే. ఎనభైశాతం లాభాలు ఇచ్చే పరిశ్రమ ఇదే! మరీ ముఖ్యంగా వేట్లపాలెంలో ఏడాదికి రూ.60 కోట్లకుపైగా విలువైన మందుగుండు తయారు చేస్తారు. జిల్లా మొత్తం మీద రూ.280 కోట్ల టర్నోవర్ ఉంటుందని అంచనా. దీపావళికి కోట్లలో వచ్చే ఆర్డర్ల కోసం తయారీదారులు తక్కువ కూలి ఇచ్చి మహిళలు, పిల్లలను సైతం ఇందులోకి దించుతున్నారు. ఏమాత్రం నైపుణ్యం లేక చేసే తప్పిదాలతో అనేకమంది దుర్మరణం పాలవుతున్నారు. నిపుణులకు ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో నిర్వాహకులు సాధారణ కూలీలతో తయారు చేయించేస్తున్నారు. తయారీ సమయంలో నిర్దిష్ట దూరం పాటించాలి. చేతికి గ్లౌజులుండాలి. ఇలాంటి జాగ్రత్తలను పట్టించుకునే వారు లేరు. ఈ జిల్లాలోనే ఏటా కనీసం 40 మంది బాణసంచా ప్రమాదాల్లో చనిపోతున్నారు. కార్మికులకు బీమా కూడా ఉండటం లేదు.
తక్కువకు కొని.. కోట్లు తిని..
బాణసంచా తయారీ కేంద్రాల్లో అనుమతులు ఉన్నవాటి కంటే అనుమతులు లేనివే అధికం. వీటి ని ఎప్పటికప్పుడు పోలీసు, రెవె న్యూ, ఫైర్ అధికారులు పర్యవేక్షిస్తుండాలి. అనుమతులు లేని వాటి ని నిలిపివేయాలి. అనుమతులు ఉన్నవాటిలో ఫైర్‌ఫైటింగ్ సిస్టం అమలు పక్కాగా ఉందో లేదో తనిఖీ చేయాలి. పిల్లలు, మహిళలు పనిచేస్తున్నారో లేదో తరచూ కార్మికశాఖ పర్యవేక్షించాలి. ఇవేవీ పక్కాగా అమలు జరగడం లేదు. ఏదైనా ఘటన జరిగిన తర్వాత రెండు రోజులు హడావుడి చేయడం... ఆ తర్వాత మళ్లీ ‘మామూలు’గా మారిపోవడం!