సాటి లేని అవినీతి
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:15 PM
కలెక్టరేట్‌లోని జేడీఏ కార్యాలయానికి అవినీతి మరకలు అంటుకుంటున్నాయి.
వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయానికి అవినీతి మరకలు
ఒక అధికారిపై సర్వత్రా విమర్శలు
తాజాగా వెలుగు చూసిన రూ.3.50 కోట్ల సబ్సిడీ వేరుశనగల వ్యవహారం
దారి మళ్లింపులో ఇది పరాకాష్ట
అవినీతికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోని యంత్రాంగం
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):
కలెక్టరేట్‌లోని జేడీఏ కార్యాలయానికి అవినీతి మరకలు అంటుకుంటున్నాయి. రైతులను కష్టాల నుంచి తప్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద వెచ్చించే నిధులను వ్యవసాయ శాఖలో కొంత మంది అధికారులు, సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు చేరవలసిన నిధులు జేబుల్లో వేసుకుందామనేగాని, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోడానికి వెచ్చించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యవసాయ శాఖ పరిధిలోని ప్రతి పథకంలో అక్రమాలే కనిపిస్తున్నాయి. ఏ ప్రభుత్వ విభాగంలో జరగనంత అవినీతి వ్యవసాయ శాఖలో జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఐదారు సంవత్సరాలుగా కర్నూలు జిల్లాలో రైతుల కోసం రూ. కోట్ల నిధులు ఖర్చు చేశారు. వీటి ద్వారా రైతులకు ఒరిగింది మాత్రం నామ మాత్రమే. ఓ ఉన్నతాధికారి వల్ల రైతు పథకాల్లో జరుగుతున్న అక్రమాలపై చర్యలు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుత ఖరీఫ్ సీజనలో జాతీయ ఆహార నూనె గింజల అభివృద్ధి పథకం కింద జిల్లాలో 16 మండలాలను ఎంపిక చేశారు. వంద శాతం సబ్సిడీతో రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. గోనెగండ్ల మినహా మిగిలిన 15 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. ఆదోని డివిజనలోని మూడు మండలాల్లో 337 మంది రైతులకు 450 క్వింటాళ్ల వంద శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశామని, అదే విధంగా ఎమ్మిగనూరులో రెండు మండలాల పరిధిలో 209 మంది రైతులకు 270 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను అత్యధికంగా పత్తికొండ డివిజన పరిధిలో 6 మండలాల్లో 999 మంది రైతులకు 1,320 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను అందజేశామని రికార్డుల్లో నమోదు చేశారు. ఆలూరులో నాలుగు మండలాల పరిధిలో 573 మంది రైతులకు 795 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను అందజేశారు. మొత్తం కర్నూలు జిల్లాలో 15 మండలాల పరిధిలో 3వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలను రైతులకు పంపిణీ చేశామని అధికారులు రికార్డుల్లో రాశారు. రైతులకు వంద శాతం సబ్సిడీపై అందించాల్సిన ఈ విత్తనాలను కేవలం కొన్ని గ్రామాల్లోనే రైతులకు అందించి మిగతా వాటిని వ్యాపారులకు అమ్ముకుని జేబులు నింపుకున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాస్తవంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఎంపిక చేసిన రైతులకు ఈ విత్తనాలను పంపిణీ చేయాలి. అలా చేస్తే తమకేమీ ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో, వాటిని దారి మళ్లించడానికి జిల్లాలోని ఓ ఉన్నతాధికారి కొంత మంది ఏడీఏలు, మండల వ్యవసాయాధికారులతో మంతనాలు జరిపారని, ఇందులో ఒక ఏవోను సంధానకర్తగా ఏర్పాటు చేసుకున్నారని రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. దారి మళ్లించిన సబ్సిడీ, వేరుశనగ విత్తనాల్లో తమకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందలేదనే అక్కసుతో కొందరు ఈ బాగోతాన్ని బట్టబయలు చేశారు. చివరకు ఒక ఉన్నతాధికారితో పాటు జేడీఏ కార్యాలయంలోని ఒక ఏవోపై ఆరోపణలు చేస్తూ వ్యవసాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఫ కమిషనర్ ఆదేశాలతో విచారణ :
కర్నూలు జిల్లాలో నూరు శాతం వేరుశనగ విత్తనాల పంపిణీ వ్యవహారంలో చోటు చేసుకున్న అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కమిషనర్ ఎంక్వైరీని చేపట్టారు. జేడీ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ నాయక్‌ను ఎంక్వైరీ అధికారిగా నియమించారు. ఈ నెల 19 నుంచి ఆ అధికారి జిల్లాలో సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసిన 15 మండలాల రైతు సేవా కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి రైతులు, సిబ్బంది మండల వ్యవసాయాధికారులు, ఏడీఏలను విచారించారు. ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు ఆదోని డివిజన్ల పరిధిలో ఆ అధికారి లోతుగా విచారణ చేశారు. ఇందులో ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయని, కొన్నిచోట్ల అధికారులు చేసిన అక్రమాల నుంచి బయట పడేందుకు రైతులు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు తీసుకోలేదని రైతు సేవా కేంద్రాలకే వెనక్కి ఇచ్చేసినట్లు తెలిపారని విచారణ అధికారి ఎదుటే తేటతెల్లమైంది. మరి కొన్ని చోట్ల వేరుశనగకాయలను తీసుకున్నా.. వర్షాభావ పరిస్థితుల వల్ల పొలాల్లో విత్తుకోలేకపోయామని, ఇళ్లలోనే నిల్వ చేసుకున్నామని రైతులతో ఆయా మండలాల వ్యవసాయాధికారులు చెప్పించినట్లు తెలిసింది. మొత్తానికి ఈ వ్యవహారంలో జేడీ కార్యాలయంలో పని చేస్తున్న ఒక ఏవోపైన చర్యలు తీసుకోడానికి అధికారులంతా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విచారణకు ముందే ఈ ఏవో డిప్యుటేషనను రద్దు చేయాల్సిందిగా కమిషనర్‌కు నివేదిక పంపినట్లు తెలిసింది. సబ్సిడీ వేరుశనగ విత్తనాల భాగోతానికి కంటే ముందు వివిధ పథకాలు, కార్యక్రమాల్లో మరి కొన్ని అక్రమాలు వెలుగు చూశాయి. 2021లో ఖరీఫ్ సీజనలో రైతులకు నాసిరకం పత్తి విత్తనాలు అంటగట్టారనే కారణంతో శాస్త్రవేత్తలు, అధికారులు నిర్ధారించి జిల్లాలోని 1800 మంది పత్తి సాగు చేసిన రైతులకు రూ.17 కోట్లు చెల్లించాలని నివేదిక కమిషనర్‌కు అందించారు. ఇప్పటి దాకా రైతులకు నష్టపరిహారం అందలేదు. ఈ వ్యవహారంలో రైతులు నష్టపోయారే తప్ప అధికారులు, సిబ్బందిపై ఎందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదని రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. దీంతో పాటు ప్రతి సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల సాగు పూర్తయిన తర్వాత కూడా యూరియా, డీఏపీ ఎరువులు పెద్ద ఎత్తున వినియోగం జరిగినట్లు అధికారుల నివేదికలో స్పష్టమవుతోంది. పంట సాగు పూర్తయ్యాక రైతులకు ఎరువుల అవసరం ఉండదు. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం సీజన్లు పూర్తయ్యాక కూడా పెద్ద ఎత్తున యూరియా, డీఏపీలను వినియోగించినట్లు కాయితాల మీద నమోదైంది. దీనిపై వ్యవసాయయ శాఖ కమిషనర్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లడంతో కమిషనరేట్ నుంచి తనిఖీ బృందాలు కర్నూలు, నంద్యాల జిల్లాలో తనిఖీలు చేపట్టాయి. ఇప్పటిదాకా జిల్లాలో వ్యవసాయ శాఖలో జరిగినంత అవినీతి, అక్రమాలు మరే శాఖలో చోటు చేసుకోలేదనే అభిప్రాయం ఉంది. సబ్సిడీ వేరుశనగ విత్తనాల కుంభకోణంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై రాష్ట్ర ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఫ సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీలో విచారణ జరుగుతోంది: వరలక్ష్మి, వ్యవసాయ శాఖ జేడీ, కర్నూలు:
జాతీయ నూనెగింజల పంపిణీ పథకం అమలులో ఫిర్యాదులు అందాయి. కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమాలపై డిప్యూటీ డైరెక్టర్ విచారణ చేస్తున్నారు. ఆ అధికారి గ్రామాలకు వెళ్లి రైతులు, ఏవోలను విచారించి స్టేట్‌మెంటును నమోదు చేశారు. త్వరతో నివేదికను కమిసనర్‌కు పంపుతారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జేడీ కార్యాలయంలో అవినీతి, అక్రమాలకు చోటు లేదు. పథకాలన్నీ రైతులకు అందిస్తున్నారు. కొంత మంది గిట్టనివారే ఆరోపణలు చేస్తున్నారు.