Share News

Governor Abdul Nazeer: వర్సిటీల ర్యాంకులు మెరుగుపడాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:56 AM

రాష్ట్ర విశ్వవిద్యాలయాలు నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకుల్లో మెరుగుపడాలని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆకాంక్షించారు.

Governor Abdul Nazeer: వర్సిటీల ర్యాంకులు మెరుగుపడాలి

  • సమానత్వం ప్రవేశాల్లోనే కాదు...విజయాలు, జీవన ఫలితాల్లోనూ కనిపించాలి

  • కంఠస్థం కాదు... సృజనాత్మక ఆలోచన అవశ్యం

  • విద్యార్థులకు ఆ దిశగా విద్యాబోధన జరగాలి

  • అక్షరాస్యత తక్కువగా ఉండటం ప్రతికూల పరిణామం

  • మానవ వనరుల బలోపేతంపైనే రాష్ట్ర భవిష్యత్తు

  • వీసీల సదస్సులో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విశ్వవిద్యాలయాలు నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకుల్లో మెరుగుపడాలని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆకాంక్షించారు. సోమవారం విజయవాడలో జరిగిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘కేవలం ఆంధ్ర విశ్వవిద్యాలయం మాత్రమే మొదటి 50 ర్యాంకుల్లో స్థానం సాధించింది. ఈ పనితీరు ర్యాంకుల మెరుగుదల ఆవశ్యకతను సూచిస్తోంది. యూనివర్సిటీ విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, నైతిక విలువలను ప్రోత్సహించే విద్యా వాతావరణాన్ని సృష్టించాలి. నాణ్యతను అంతర్గత సంస్కృతిగా చూడాలి. కేవలం పాఠాలు కంఠస్థం చేయడం కాదు. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించేలా బోధన జరగాలి. మన యూనివర్సిటీల్లో విద్యార్థులు ధైర్యంగా, నైపుణ్యంతో కోర్సు పూర్తిచేసేలా చేయడం ప్రధాన సవాలు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థుల అవసరాలపై విశ్వవిద్యాలయాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమానత్వం అనేది కేవలం ప్రవేశాలకు పరిమితం కాకుండా వారి విజయాలు, జీవన ఫలితాల్లోనూ ప్రతిఫలించాలి. ప్రస్తుతం మనం జీవిస్తున్న సాంకేతిక యుగంలో కేవలం డిగ్రీ సరిపోదు. విద్యార్థులు నైపుణ్యాలను, డిజిటల్‌ అవగాహనను పెంచుకునేలా ఉండాలి. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటం ప్రతికూల పరిణామం. గ్రామీణ, గిరిజన విద్యార్థుల్లో అక్షరాస్యతను పెంచాల్సిన ఆవశ్యకతను అక్షరాస్యత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో జీఈఆర్‌ 36.5గా ఉంది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. ఈ విజయాలు ప్రశంసనీయమైనప్పటికీ తర్వాత దశలో నాణ్యతా ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఉంది. నాణ్యత అనేది బలమైన ఉన్నత విద్యకు మూల స్తంభం. విద్య సామాజిక బాధ్యతను పెంపొందించాలి. విశ్వవిద్యాలయాలు బోధనా కేంద్రాలుగా మాత్రమే కాకుండా జ్ఞానం సృష్టించే ఇంజన్లుగా కూడా వ్యవహరిస్తాయి. వీసీలు కీలక స్థానాల్లో ఉంటారు. మీ నాయకత్వం సంస్థలను తీర్చిదిద్దుతుంది. వేలాది మంది విద్యార్థులను ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు మానవ వనరుల బలోపేతంపై ఆధారపడి ఉంది’’ అని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.


మన డిగ్రీలకు విలువ పెరగాలి

అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఉప కులపతులు విద్యారంగాన్ని నడిపించే నాయకులుగా, సంస్కరణల అంబాసిడర్లుగా పనిచేయాలని మంత్రి లోకేశ్‌ సూచించారు. సోమవారం విజయవాడలో జరిగిన వీసీల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘విజ్ఞాన సమాజాన్ని సృష్టించడంలో విశ్వవిద్యాలయాలదే కీలక పాత్ర. చాలా మంది ఉన్నత విద్యను పూర్తిచేసి బయటికొచ్చినప్పుడు గందరగోళ పరిస్థితుల్లో మిగిలిపోతున్నారు. అందుకే ఐదు అంశాలపై విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఐదు సవాళ్లు

  • మన డిగ్రీలకు అంతర్జాతీయ స్థాయిలో డి మాండ్‌ తక్కువ. పాఠ్యాంశాల మార్పులపై దృష్టిపెట్టి, డిగ్రీలకు విలువ పెరిగేలా చేయాలి.

  • తగిన ఇంటర్న్‌షి్‌పలు, అప్రెంటీస్‌లు, ప్లేస్‌మెంట్‌ వ్యవస్థలు లేక మన డిగ్రీలకు విశ్వసనీయత తగ్గుతోంది.

  • పరిశోధన, ఆవిష్కరణ, జ్ఞాన ప్రభావం మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. మన స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌లు బలహీనంగా పనిచేస్తున్నాయి.

  • విద్య కంటే పరిపాలన అంశాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అధ్యాపకుల లోటు ఉంది. విద్యా ప్రమాణాలపై ఇంకా ఎక్కువ సమయం కేటాయించాలి.

  • విద్యార్థుల అనుభవంలో సమానత్వం, నిలకడ లోపిస్తోంది. వారికి మార్గదర్శకం, సంక్షేమం, మానసిక మద్దతు లేమి పెద్దసవాలుగా ఉంది.


పరిశోధన వర్సిటీల ఆత్మ

‘‘పాతకాలం పాఠ్యాంశాలను బోధించడం అంటే విద్యార్థులకు ద్రోహం చేయడమే. మన దగ్గర డిగ్రీలు పొందినా, ఆ తర్వాత 4 నెలలు అమీర్‌పేట్‌లో శిక్షణ తీసుకుని ఉద్యోగాలు పొందుతున్నారు. ఇది విద్యార్థుల వైఫల్యం కాదు, సంస్థల వైఫల్యం. పరిశోధన అనేది విశ్వవిద్యాలయాల ఆత్మ. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు మన లక్ష్యం’ అని లోకేశ్‌ అన్నారు. ఈ సదస్సులో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.మధుమూర్తి, ఉన్నతాధికారులు కోన శశిధర్‌, బుడితి రాజశేఖర్‌, సౌరభ్‌ గౌర్‌, భరత్‌గుప్తా పాల్గొన్నారు.

ఆర్థిక స్వావలంబన సాధించాలి

‘ఆర్థిక ఒత్తిడిని అధిగమించేందుకు వర్సిటీలు ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయాలి. ఫార్చూన్‌ 500 కంపెనీల సీఈవోలలో మన పూర్వ విద్యార్థులున్నారు. రాబోయే దశాబ్దానికి ఉపయోగపడేలా సిలబ్‌సలో మార్పులు చేయాలి. నాలెడ్జ్‌ చాలా వేగంగా మారుతోంది. రాబోయే పదేళ్లలో వచ్చే ఉద్యోగాల్లో 80 శాతం మనకు తెలియనవి ఉంటాయి. మొత్తం విద్యా విధానం ప్రక్షాళన కావాలి. నాణ్యత కొలమానంగా మార్పులు రావాలి’ అని లోకేశ్‌ అన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 05:57 AM