Share News

ఆవిష్కరణ కేంద్రాలుగా వర్సిటీలు

ABN , Publish Date - Jul 01 , 2026 | 04:23 AM

విశ్వవిద్యాలయాలు నూతన ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాలని, ఆ దిశగానే ఏపీ ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు మంత్రి లోకేశ్‌ చెప్పారు.

ఆవిష్కరణ కేంద్రాలుగా వర్సిటీలు

  • ఆ దిశగానే ఏపీ ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకొస్తున్నాం

  • ప్రతి విద్యార్థికీ ఉపాధే లక్ష్యం.. విద్యతోనే ప్రజల జీవితాల్లో మార్పు సాధ్యం

  • నాణ్యమైన చదువు దేశంలోని ప్రతి మూలకూ, ప్రతి వర్గానికీ చేరాలి

  • గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో మంత్రి లోకేశ్‌

విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాలు నూతన ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాలని, ఆ దిశగానే ఏపీ ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు మంత్రి లోకేశ్‌ చెప్పారు. విశాఖలోని నోవాటెల్‌ హోటల్‌లో మంగళవారం జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. యూనివర్సిటీలు నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులను మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన పౌరులను, మానవతా దృక్పథం కలిగిన నాయకులను తయారు చేయాలన్నారు. విద్య అసలు ఉద్దేశం డిగ్రీ సంపాదించడం మాత్రమే కాదని, ప్రజల జీవితాలను మార్చే పరిష్కార మార్గాలను కూడా చూపించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మనమంతా కృత్రిమ మేధ యుగంలో ఉన్నామని, ఏఐ అడిగిన వాటికి సమాధానాలు ఇస్తుంది కానీ, మానవీయ విలువలు, కరుణ, వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్యగా మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. ఇది ఏపీలోని గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం మాత్రమే కాదని, అవకాశాల, సమ్మిళిత అభివృద్ధి వేడుకగా అభివర్ణించారు. నాణ్యమైన విద్య దేశంలోని ప్రతి మూలకు, సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలనే విశ్వాసానికి ప్రతీకగా నిలిచే వేడుక అన్నారు. ప్రధాని మోదీ కలలుగన్న వికసిత్‌ భారత్‌లో నాణ్యమైన విద్య, ఆవిష్కరణలు, పరిశోధనలు దేశ నిర్మాణానికి కేంద్ర బిందువులుగా నిలుస్తాయన్నారు.


భవిష్యత్తు నాయకులుగా విద్యార్థులు

జాతీయ దార్శనికత నుంచి స్ఫూర్తి పొందుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకువచ్చినట్టు లోకేశ్‌ తెలిపారు. తమ లక్ష్యం కేవలం డిగ్రీ అందుకునే విద్యార్థులను తయారు చేయడం కాదని, భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడమన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో నాణ్యమైన అధ్యాపక బృందం, పరిశ్రమల అవసరాలకు అనుసంధానమైన నైపుణ్యాలు, పరిశోధన, ఆవిష్కరణల ద్వారా ప్రతి విద్యార్థి విజయవంతమయ్యేలా భవిష్యత్తు విశ్వవిద్యాలయాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభతో పోటీ పడగలమనే ఆత్మవిశ్వాసం యువతలో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ‘మీ వల్ల ఎన్ని జీవితాలు మారాయి, ఎన్ని సమస్యలకు పరిష్కారాలు లభించాయన్నదే మీ విజయానికి ప్రామాణికం కావాలి’ అని విద్యార్థులకు మంత్రి సూచించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే, అన్ని వర్గాలు భాగస్వామ్యం అయితేనే వికసిత్‌ భారత్‌ కల సాకారమవుతుందన్నారు.

రాష్ట్రపతి ముర్ము ప్రయాణం ఆదర్శం

రాష్ట్రపతి ముర్ము జీవితం ఈ విశ్వవిద్యాలయం వంటి విద్యాసంస్థలు ఎందుకు అవసరమో చెప్పే ఉత్తమ సమాధానంగా లోకేశ్‌ పేర్కొన్నారు. రాష్ట్రపతి ఒడిశాలో ఉపర్‌బేడా అనే చిన్న గిరిజన గ్రామంలో జన్మించారని, పాఠశాలకు వెళ్లాంలంటే ఎంతో దూరం నడవాల్సి వచ్చేదన్నారు. గిరిజన బాలికలు ఉన్నత విద్యను అభ్యసించడం చాలా అరుదని, అయినప్పటికీ ఆమె తన గ్రామం నుంచి డిగ్రీ పూర్తిచేసిన తొలి మహిళగా నిలిచారని కొనియాడారు. ఆమె ఉపాధ్యాయురాలిగా సేవలు అందించారని, ఆ తర్వాత కౌన్సిలర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని తెలిపారు. ఆమె అధిరోహించిన పదవులే కాకుండా ఆమె జీవితంలో ఎదుర్కొన్న విషయాలు కూడా అసాధారణంగా నిలబెట్టాయన్నారు. 2009- 2019 మధ్య కుటుంబంలో ఎంతో మందిని కోల్పోయినా మొక్కవోని దీక్షతో ముర్ము ముందుకు సాగారని ప్రశంసించారు.

Updated Date - Jul 01 , 2026 | 04:24 AM