లాజిస్టిక్స్ హబ్‌గా విశాఖ వినియోగంలో లేని భూములపై దృష్టి
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:25 AM
విశాఖపట్నం త్వరలోనే ప్రధాన లాజిస్టిక్స్ హబ్‌గా మారనుందని కేంద్ర పోర్టులు, నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు.
అక్కయ్యపాలెంలో ‘ఇనార్బిట్ మాల్’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి సోనోవాల్
త్వరలో అతి పెద్ద సినిమా థియేటర్: మాల్ సీఈవో
విశాఖపట్నం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం త్వరలోనే ప్రధాన లాజిస్టిక్స్ హబ్‌గా మారనుందని కేంద్ర పోర్టులు, నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. దేశంలో నిరుపయోగంగా ఉన్న భూముల వినియోగంపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. దీనిలో భాగంగానే విశాఖ పోర్టు భూములను ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి లీజుకు ఇచ్చామని చెప్పారు. విశాఖనగరంలోని అక్కయ్యపాలెంలో రూ.600 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘ఇనార్బిట్ మాల్’ను సోమవారం ఆయన అసోం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖ పోర్టు ద్వారా రూ.39 వేల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని, దీనిలో దుగరాజపట్నం పోర్టు, షిప్ బిల్డింగ్ క్లస్టర్‌కు సంబంధించి రూ.29,662 కోట్ల ప్రాజెక్టు ముఖ్యమైందని వెల్లడించారు. రూ.1,390 కోట్లతో బెర్త్ ఆధునికీకరణ, సరకుల నిల్వకు గోడౌన్ల నిర్మాణం, ట్రక్ టెర్మినళ్లు, రైల్వే విద్యుదీకరణ, మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. వీటి ద్వారా విశాఖపట్నం ప్రధాన లాజిస్టిక్స్ హబ్‌గా మారుతుందన్నారు. కె.రహేజా గ్రూపు ప్రెసిడెంట్ నీల్ రహేజా మాట్లాడుతూ.. ఈ నెల 27 నుంచి ఈ మాల్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. ‘ఇనార్బిట్ మాల్’ సీఈవో రజనీశ్ మహాజన్ మాట్లాడుతూ, మరో 3 నెలల్లో ఏపీలోనే అతి పెద్ద సినిమా థియేటర్‌ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. 8 స్ర్కీన్లు, 1,600 సీటింగ్ సామర్థ్యం ఉంటుందన్నారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో అతి పెద్ద షాపింగ్‌మాల్ తన నియోజకవర్గంలో రావడం సంతోషంగా ఉందన్నారు. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరంజి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అరుణ ప్రసాద్, పోర్టు కార్యదర్శి ఎం. శంకరబాబు తదితరులు పాల్గొన్నారు.