‘మామ’ ఉత్త చేతులతో రాడు!
ABN , Publish Date - Jul 03 , 2026 | 04:41 AM
‘మామ వస్తే ఉత్త చేతులతో రాడు కదా! ఏపీ రైతుల నుంచి 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద కేంద్రం కొనుగోలు చేస్తుంది’ అని..
2,16,250 టన్నుల తోతాపురి కొంటాం
రాష్ట్రానికి పీఎంఏవై కింద 74,212 కొత్త ఇళ్లు
గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.422 కోట్లు
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన
‘వీబీ జీరామ్‌జీ’ కింద తొలి రోజే 5 లక్షల మందికి ఉపాధి: కేంద్ర మంత్రి
తిరుపతి/రైల్వేకోడూరు, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘మామ వస్తే ఉత్త చేతులతో రాడు కదా! ఏపీ రైతుల నుంచి 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద కేంద్రం కొనుగోలు చేస్తుంది’ అని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పత్రాలను ఆయన సీఎం చంద్రబాబుకు అందించారు. ముక్కావారిపల్లె సభ ఇందుకు వేదికైంది. సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు నేతృత్వంలో రాయలసీమ హార్టీకల్చర్ హబ్‌గా మారుతోందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి పీఎంఏవై కింద కొత్తగా 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి రూ.422 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలను ఆయన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందజేశారు. యూపీఏ హయాంలో పదేళ్లలో ఉపాధి హామీ పథకం (నరేగా) కింద రూ.2.13 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. ప్రధాని మోదీ నేతృత్వంలో పదేళ్ల ఎన్డీయే పాలనలో రూ.8.86 లక్షల కోట్లు ఖర్చు చేశామని చౌహాన్ చెప్పారు.
రానున్న ఐదేళ్లలో వీబీ-జీరామ్‌జీ పథకం ద్వారా రూ.7.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. తొలి రోజే 5 లక్షల మందికి ఉపాధి లభించిందని చెప్పారు. ‘వాజపేయి ప్రధానిగా.. వెంకయ్యనాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన తీసుకొచ్చారు. ఆ పథకమే యూపీఏ హయాంలో నరేగాగా మారింది. ఇప్పుడు వీబీ-జీరామ్‌జీగా రూపాంతరం చెందింది.’ అని తెలిపారు. చంద్రబాబు తన విజన్‌తో నాడు సైబరాబాద్‌ను అభివృద్ధి చేశారని చౌహాన్ అన్నారు. ఇప్పుడు అమరావతి నిర్మాణంతోపాటు పెట్టుబడులను రాబట్టుకోవడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్న విశ్వాసం తనకుందని చెప్పారు. చంద్రబాబు, పవన్ నేతృత్వంలో రాయలసీమ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. వీబీ-జీరామ్‌జీ పథకం అమలులో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తుందనడంలో తనకు ఎలాంటి సందేహమూ లేదని చెప్పారు.
అందుకే ప్రక్షాళన..
‘అనేక రాష్ట్రాల్లో ఉపాధి పథకాన్ని దుర్వినియోగం చేశారు. శాశ్వత ప్రయోజనం లేని ఆస్తులను సృష్టించారు. అనుమతులు లేని వాటిపై నిధులు ఖర్చు చేశారు. 4.40 కోట్ల నకిలీ జాబ్‌కార్డులు సృష్టించారు. 2014లో ప్రధాని మోదీ దీనిని గుర్తించి ప్రక్షాళన చర్యలు చేపట్టారు. శాటిలైట్ జియోట్యాగింగ్ ద్వారా పనులు ప్రారంభించారు. తన దూరదృష్టితో పల్లెల్లో నిజమైన మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు వీబీ-జీరామ్‌జీ ద్వారా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు’ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభలో అన్నారు. వైసీపీ హయాంలో 3.50 లక్షల కాంట్రాక్టర్లకు రూ.180 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి సాఫ్ట్‌వేర్‌ను మూసివేశారని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ నిధులు చెల్లించామన్నారు. రాష్ట్రానికి గత రెండేళ్ల కాలంలో రూ.20 వేల కోట్లు తెచ్చుకోగలిగామన్నారు.
నేను పవన్ అభిమానిని: కమలేశ్
‘పుణ్యభూమి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. కొత్తగా వీబీ-జీరామ్‌జీతో గ్రామీణ భారత నవయుగం ప్రారంభమైంది’ అని మరో కేంద్ర సహాయ మంత్రి కమలేశ్ పాశ్వాన్ అన్నారు. ఆయన ప్రసంగించే సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. దీంతో తానూ పవన్ ప్రసంగం వినాలని అనుకుంటున్నానని.. పవన్‌కు తాను పెద్ద అభిమానినని కమలేశ్ చెప్పారు. ఆయన సినిమాలు చాలా చూశానన్నారు. పవన్ తన స్టార్‌డమ్ విడిచి ప్రజాసేవకు ముందుకొచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.