Share News

తిరుమల కాలినడక మార్గంలో ఏర్పాట్లు అద్భుతం

ABN , Publish Date - May 25 , 2026 | 05:04 AM

తిరుమల కాలినడక మార్గంలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

తిరుమల కాలినడక మార్గంలో ఏర్పాట్లు అద్భుతం

  • భక్తులు సంతృప్తిగా ఉన్నారు: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

తిరుమల, మే 24 (ఆంధ్రజ్యోతి): తిరుమల కాలినడక మార్గంలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆదివారం ఆయన అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు శివన్‌ ఎర్రన్నాయుడికి పుట్టువెంట్రుకలు తీసేందుకు తిరుమలకు వచ్చామని చెప్పారు. కాలినడకన 4 గంటల్లో తిరుమలకు చేరుకోవడం మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు.

ఆ ముగ్గురికి ప్రత్యేక అభినందనలు

‘దేవాలయాలు, ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలను మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దీని కోసం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తిరిగి రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక శక్తిని ముందుకు నడిపించడానికి కృషి చేస్తున్నారు. ఈక్రమంలో ఆ ముగ్గురికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నా’ అని రామ్మోహన్‌ నాయుడు చెప్పారు. మన సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందని, దానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు. కాగా, రామ్మోహన్‌ నాయుడు రాత్రికి తిరుమలలోనే బస చేసి సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Updated Date - May 25 , 2026 | 05:06 AM