Share News

ఒకే మాట.. ‘రాజధాని అమరావతి’

ABN , Publish Date - Apr 03 , 2026 | 07:21 AM

‘ఐదు కోట్ల మంది ఆంధ్రులు అందరిదీ ఒకే మాట.. అదే రాజధాని అమరావతి’ అని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు.

ఒకే మాట.. ‘రాజధాని అమరావతి’

  • 5 కోట్ల మంది ఆంధ్రులు అందరిదీ..

  • రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌

న్యూఢిల్లీ/శ్రీకాకుళం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ‘ఐదు కోట్ల మంది ఆంధ్రులు అందరిదీ ఒకే మాట.. అదే రాజధాని అమరావతి’ అని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందుతున్నందున ఇది ఏపీ చరిత్రను పునర్నిర్వచించే చారిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన క్షణమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, 2026పై గురువారం రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. విభజన సమయంలో ఏపీకి రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని, భవిష్యత్తుపై అస్పష్టత నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి క్లిష్ట సమయంలో ప్రజలకు చంద్రబాబు ఒక ఆశాకిరణంలా నిలిచారని కొనియాడారు. ఒక కొత్త విమానాశ్రయ నిర్మాణానికి వెయ్యి ఎకరాలు సేకరించడమే కష్టమైన తరుణంలో, అమరావతి రైతులు కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రాజధాని కోసం ఇచ్చారని ప్రశంసించారు. ‘గత వైసీపీ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం అమరావతిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించింది. మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రంలో గందరగోళం, అనిశ్చితిని సృష్టించింది. ఎవరెన్ని కుట్రలు పన్నినా అమరావతిలో ఒక్క ఇటుక కూడా కదల్చలేకపోయారు. రాజధాని కోసం పోరాడిన మహిళలను, గర్భిణులను సైతం నాటి వైసీపీ ప్రభుత్వం హింసించింది.’ అని రామ్మోహన్‌ ఆరోపించారు. అమరావతిని పునర్నిర్మాణం చేస్తామని 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ప్రజలకు కూటమి హామీ ఇచ్చిందని, వారు 175కి 164 సీట్లు ఇచ్చి చారిత్రాత్మక విజయాన్ని అందించారని చెప్పారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, రాయలసీమ ఇలా అన్ని ప్రాంతాల ప్రజలు ఏకగ్రీవంగా అమరావతికి మద్దతు తెలిపారని, ఇది ఈ అంశంపై రాష్ట్రవ్యాప్త ఐక్యతను చాటిచెబుతోందని పేర్కొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 07:22 AM