వికసిత్ భారత్ నిర్మాణంలో పాల్గొనండి
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:15 AM
వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు.
ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
అమరావతి, విజయవాడ, జూన్ 16(ఆంధ్రజ్యోతి): వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మంగళవారం విజయవాడలో విశిష్ట వ్యక్తులు, మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పన్నెండేళ్ల మోదీ పాలన దేశ అభివృద్ధి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. ప్రపంచ వేదికలపై దేశ ప్రతిష్ఠ గణనీయంగా పెరిగిందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచానికి ఆదర్శంగా మారిందన్నారు. దేశం రూ.38 వేల కోట్లకుపైగా రక్షణ రంగ పరికరాలను ఎగుమతులు చేస్తోందని వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ విభజన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష సహకారం అందించిందని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.