AP Government: షాపులు, బార్లకు ఒకే ధరకు మద్యం
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:05 AM
మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం నుంచి మద్యం దిగుమతి చేసుకునే మద్యం ధరల్లో... షాపులు, బార్ల మధ్య ఉన్న...
బార్లపై అదనపు ఏఆర్‌ఈటీ రద్దు
దీంతో ప్రభుత్వానికి 340 కోట్ల నష్టం
మద్యం ధర సీసాపై రూ.10 పెంపు
పెంపు వల్ల 1,391 కోట్ల ఆదాయం
క్వార్టర్ రూ.99, బీరుపై పెంపు లేదు
మద్యం అమ్మకాలపై కీలక నిర్ణయాలు
అమరావతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం నుంచి మద్యం దిగుమతి చేసుకునే మద్యం ధరల్లో... షాపులు, బార్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించేందుకు ఏఆర్‌ఈటీ (అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్)ను రద్దు చేయాలని నిర్ణయించింది. మద్యం షాపుల లైసెన్సీలకు ఎమ్మార్పీపై మార్జిన్ ఒక శాతం పెంచాలని, వీటివల్ల ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మద్యం ధరలను లిక్కర్ సీసాపై రూ.10 పెంచాలని నిర్ణయించింది. ఈ అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను గురువారం జరిగిన క్యాబినెట్ ఆమోదించింది. పేదలను ఉద్దేశించి ప్రవేశపెట్టిన క్వార్టర్ రూ.99 బ్రాండ్లపై ధరలు పెంచడం లేదు. బీరు, వైన్, రెడీ టూ డ్రింక్స్‌పైనా పెంపు ఉండదు. మద్యం ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. ఏఆర్‌ఈటీ రద్దుతో రూ.340 కోట్ల నష్టం వాటిల్లుతుంది. అలాగే షాపుల లైసెన్సీలకు 1శాతం మార్జిన్ పెంచడం వల్ల కూడా కొంత ఆదాయం కోల్పోవాల్సి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ల వెలుపల 5 కి.మీ. పరిధిలో త్రీస్టార్ లేదా అంతకంటే ఎక్కువస్థాయి హోటళ్లలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతివ్వాలని నిర్ణయించింది. అలాగే, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సమస్యను కూటమి ప్రభుత్వం ఇప్పుడు పరిష్కరించింది. వైసీపీ సర్కారు రాకముందు బార్లకు, మద్యం షాపులకు ప్రభుత్వం ఒకే ధరకు మద్యాన్ని విక్రయించేది.
ఆ తర్వాత షాపులు, బార్లు వినయోగదారులకు మద్యం అమ్ముకునేవారు. గత ప్రభుత్వం బార్ల లైసెన్సీలను మార్చేయాలనే కుట్రతో లైసెన్స్ గడువు ముగియకముందే కొత్త పాలసీ తేవాలని నిర్ణయించింది. దీనిపై బార్ల లైసెన్సీలు హైకోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దాంతో ఆగ్రహానికి గురైన అప్పటి ప్రభుత్వం బార్లకు ఇచ్చే మద్యంపై 10 శాతం ఏఆర్‌ఈటీ విధించింది. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం ఏఆర్‌ఈటీని రద్దుచేసి ధరలను సమానం చేసింది.