Share News

వారికో న్యాయం.. మాకో న్యాయమా?

ABN , Publish Date - Mar 23 , 2026 | 03:50 AM

ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల అంశంలో ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని 2018లో ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

వారికో న్యాయం.. మాకో న్యాయమా?

  • రిజర్వేషన్లు పాటించని ప్రొఫెసర్ల కొనసాగింపు

  • పాటించిన అసోసియేట్‌, అసిస్టెంట్‌లకు అన్యాయం

  • ప్రొఫెసర్‌ పోస్టులకు మాత్రమే మేలు చేసిన వైసీపీ ప్రభుత్వం

  • పలు అంశాలపై న్యాయ వివాదం.. న్యాయం కోసం అభ్యర్థుల డిమాండ్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల అంశంలో ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని 2018లో ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అప్పట్లో ఒకే జీవో ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వగా ప్రొఫెసర్లకు ఒక న్యాయం.. అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు మరొక న్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ద్వంద్వ విధానంపై పునఃసమీక్షించి న్యాయం చేయాలని కోరుతున్నారు. 2019కు ముందు టీడీపీ ప్రభుత్వం యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరతను అధిగమించేందుకు 91 ప్రొఫెసర్‌, 185 అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 1,109 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసింది. తద్వారా 14 యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది అందుబాటులోకి వస్తారు. 2017 డిసెంబరు, 2018 జనవరిలో ఈ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అప్పటికి అమల్లో ఉన్న రిజర్వేషన్‌ విధానం, యూనివర్సిటీ యూనిట్‌గా దీనిలో ఆర్ట్స్‌, సైన్స్‌, ఇంజనీరింగ్‌ విభాగాలకు రోస్టర్‌ విధానం అమలు చేస్తూ ఈ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వాటి ఆధారంగా రాత పరీక్షలు నిర్వహించగా 3,436 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఉత్తీర్ణత సాధించారు. వారిని ఇంటర్వ్యూలకు సైతం పిలిచారు. ఆ తర్వాత రిజర్వేషన్‌ అంశం తెరపైకి రావడంతో ప్రక్రియను నిలిపివేశారు. మరోవైపు అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టులకు రాత పరీక్ష లేకపోవడంతో నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించారు.


రోస్టర్‌పై న్యాయ వివాదాలు

ఈ నోటిఫికేషన్లు జారీ అయిన తర్వాత 2018 ఏప్రిల్‌లో ప్రభుత్వం మహిళలు, దివ్యాంగులకు హారిజంటల్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. కాగా, అప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు హారిజంటల్‌కు ముందున్న రోస్టర్‌ అమలు చేశారు. అలాగే యూనివర్సిటీ యూనిట్‌గా అందులో ఆర్ట్స్‌, సైన్స్‌, ఇంజనీరింగ్‌ విభాగాలకు రోస్టర్‌ అమలుచేశారు. ఆ తర్వాత సబ్జెక్టు రోస్టర్‌గా పోస్టులు భర్తీచేయాలని యూజీసీ ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వులు కూడా ఈ నోటిఫికేషన్ల అనంతరం అమల్లోకి వచ్చాయి. అయితే, హారిజంటల్‌ రిజర్వేషన్‌ విధానం అమలు చేయలేదని, యూజీసీ రోస్టర్‌ విధానం కూడా అమలు కాలేదని కొందరు కోర్టులకు వెళ్లారు. దీంతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు ఆపేశారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల ఫలితాలను వెల్లడించలేదు. కానీ ప్రొఫెసర్‌ పోస్టులకు మాత్రం ఫలితాలు ఇచ్చి, 29 మందిని ప్రొఫెసర్లుగా ఎంపిక చేశారు. అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రిజర్వేషన్‌ అమలుచేయగా... ప్రొఫెసర్‌ పోస్టులకు ఎలాంటి రిజర్వేషన్లు అమలుచేయలేదు.


వైసీపీ ప్రభుత్వంలో అవే నిబంధనలు

వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్‌ సమీప బంధువు ఈసీ సురేంద్రనాఽథ్‌రెడ్డి కోసం ప్రత్యేకంగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో రెండు ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీచేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు అమలుచేసిన రిజర్వేషన్‌ విధానాన్నే ఆ నోటిఫికేషన్లలోనూ పాటించారు. కొత్తగా వచ్చిన హారిజంటల్‌ రిజర్వేషన్‌ విధానం అమలుచేయలేదు. కాగా, జగన్‌ బంధువు సురేంద్రనాథ్‌రెడ్డి బయోటెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా ఎంపిక కావడం విశేషం. అయితే వీటిలో రిజర్వేషన్లు పాటించలేదని న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు కావడంతో మొత్తం నోటిఫికేషన్లను హైకోర్టు రద్దుచేసింది. దీనిపై ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో నాటి వైసీపీ ప్రభుత్వం కోర్టులో ద్వంద్వ వాదనలు వినిపించింది. సురేంద్రనాథ్‌రెడ్డి కోసం ప్రొఫెసర్లను కొనసాగిస్తామని న్యాయస్థానానికి తెలిపిన గత ప్రభుత్వం, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో 22 మంది ప్రొఫెసర్లు ఇప్పటికీ కొనసాగుతుండగా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేయాలని, ప్రొఫెసర్లతో పాటు తమనూ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Updated Date - Mar 23 , 2026 | 03:50 AM