Share News

డ్రగ్స్‌ తీసుకో బ్రో వైసీపీ నినాదం..: ఉండవల్లి శ్రీదేవి

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:15 AM

కూటమి లక్ష్యం డ్రగ్స్‌ ఫ్రీ ఆంధ్ర అని ఏపీ మాదిగ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో..

డ్రగ్స్‌ తీసుకో బ్రో వైసీపీ నినాదం..: ఉండవల్లి శ్రీదేవి

అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): కూటమి లక్ష్యం డ్రగ్స్‌ ఫ్రీ ఆంధ్ర అని ఏపీ మాదిగ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వైసీపీ హయాంలో డ్రగ్స్‌ తీసుకో బ్రో అనే నినాదం వినిపిస్తే.. కూటమి హయాంలో డ్రగ్స్‌ వద్దు బ్రో అనే నినాదం వినిపిస్తోందని అన్నారు. వైసీపీ హయాంలో వైసీపీ నేత పులిగం కొండారెడ్డి పాఠశాలలు, కాలేజీలను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్‌ అమ్మినా జగన్‌ సస్పెండ్‌ చేయకపోగా పెద్ద పదవులిచ్చి సన్మానించారని ఆరోపించారు. మత్తు మహమ్మారి నుంచి యువతను కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వం పవిత్ర యుద్ధాన్ని ప్రారంభించిందని అన్నారు. గంజాయి సాగు చేసే గిరిజనులను శిక్షించడం ప్రభుత్వ లక్ష్యం కాదని, అందుకే పరివర్తన అనే సంస్థ ద్వారా వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి, ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా చర్యలు చేపట్టిందని అన్నారు. మత్తు నుంచి విముక్తి పొందాలనుకునే వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 56 డీ అడిక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ వ్యసనం నుంచి బయటపడాలనుకున్నా, గంజాయి విక్రయ సమాచారం తెలపాలనుకున్నా 1972 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ లేదా 8977781972 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 05:16 AM