ఏపీలో రూ.2,279 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:09 AM
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.2,279.16 కోట్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.2,279.16 కోట్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్‌సభలో సోమవారం టీడీపీ ఎంపీ జీఎం హరీశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. గత నెల 28 నాటికి రాష్ట్రంలో సుమారు రూ.2,279.16 కోట్ల నిధులు క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయాయని, ఈ సొమ్మును అసలైన యజమానులకు లేదా వారి వారసులకు చేర్చేందుకు కేంద్రం, ఆర్‌బీఐ సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాయన్నారు. ‘మీ సొమ్ము-మీ హక్కు’ అనే ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏపీలో 158 ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి 34,455 ఖాతాలకు సంబంధించి రూ.161.69 కోట్లను సెటిల్ చేశామన్నారు. కోనసీమ జిల్లాలో 1,899 ఖాతాలకు చెందిన రూ.5.08 కోట్లను వారసులకు అందజేసినట్లు తెలిపారు.