Uyyalawada: పిల్లలను పెంచలేక.. ఎవరూ ఆదరించక
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:39 AM
భార్య మరణంతో.. ముగ్గురు చిన్నారులను పెంచలేక.. బంధువుల ఆదరణా కరువై..తీవ్రంగా మదనపడిన ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు! కన్నబిడ్డలకు పాలల్లో విషమిచ్చాడు.
ముగ్గురు బిడ్డలకు విషమిచ్చి చంపిన తండ్రి
ఆపై తానూ ఉరివేసుకుని బలవన్మరణం
ఐదు నెలల క్రితం భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడలో పెను విషాదం
ఉయ్యాలవాడ, జనవరి 1(ఆంధ్రజ్యోతి): భార్య మరణంతో.. ముగ్గురు చిన్నారులను పెంచలేక.. బంధువుల ఆదరణా కరువై..తీవ్రంగా మదనపడిన ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు! కన్నబిడ్డలకు పాలల్లో విషమిచ్చాడు. ఆపై తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుమల దిన్నె గ్రామంలో గురువారం నూతన సంవత్సరం వేళే ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాలివీ.. తుడుమలదిన్నె వాసి వేములపాటి సురేంద్ర(35)కు అవుకు మండలం మహేశ్వరితో 8ఏళ్ల క్రితం వివాహమైది. సురేంద్ర వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవించేవాడు. వీరికి కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి(4), సూర్యగగన్(1) సంతానం. మహేశ్వరి బాలింతగా ఉండగా గతేడాది ఆగస్టు 16వ తేదీన అనారోగ్యం కారణంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడాయి. చిన్నపిల్లల ఆలనాపాలనా చూసేందుకు ఎవరూ సాయం చేసేవారు కారు. బంధువులు కూడా వచ్చేవారు కారు. దీంతో కావ్యశ్రీ, ధ్యానేశ్వరిలను అంగన్‌వాడీ కేంద్రానికి పంపేవాడు. ఇక సూర్య గగన్‌ను ఎలా చూసుకోవాలో అతడికి తెలిసేది కాదు. సురేంద్ర తండ్రి కూడా పక్షవాతంతో మంచానపడ్డాడు. సురేంద్ర తల్లి చనిపోతే, ఆయన మరో ఆమెను పెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నారు. సురేంద్ర పిల్లలను చూసుకోవడానికి బంధువుల నుంచి ఎలాంటి సహకారం లేదు. అయినప్పటికీ ఐదు నెలలుగా ఎలాగోలా చూసుకునేవాడు. ఓవైపు పిల్లలను చూసుకోవటం భారం కాగా, మరోవైపు వారిని పోషించే స్థోమత లేక.. తీవ్ర మనోవైదనకు గురయ్యాడు.
తాను తనువు చాలిస్తే తన పిల్లలు మరొకరికి భారం కాకూడదనుకున్నాడో ఏమో ముగ్గురు పిల్లలకూ విషమిచ్చాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో పాలడబ్బాతో పాటు చిన్నపిల్లలకు ఇష్టమైన రెండు కూల్‌డ్రింక్ (మాజా) బాటిళ్లను పోలీసులు గుర్తించారు. ఇద్దరు కుమార్తెలకు కూల్‌డ్రింక్, కుమారుడికి పాలలో విషం కలిపి ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 8 గంటలైనా పిల్లలు ఇంటి నుంచి బయటికి రాకపోవటంతో పక్క వీధిలో ఉంటున్న సురేంద్ర సవతి తల్లికి అనుమానం వచ్చి చూడగా ఈ ఘోరం వెలుగుచూసింది. గురువారం రాత్రి నలుగురికీ సురేంద్ర పెద్దన్న కొద్దిమందితో కలిసి అంత్యక్రియలు జరిపించారు. కాగా, సురేంద్ర బంధువులతోపాటు.. మహేశ్వరి తల్లిదండ్రులు కూడా అంత్యక్రియలు రాకపోవడం విచారకరం. ఆత్మహత్య ఘటనకు ముందు స్నేహితులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు సెల్‌ఫోన్‌ద్వారా తెలియజేసిన సురేంద్ర ఇంతపని చేస్తాడని ఊహించలేదని స్నేహితులు కంటతడిపెట్టారు.