Share News

అత్త సూటిపోటి మాటలకు.. పసికందునే చంపుకొంది

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:42 AM

నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ వైద్యానికి అధికంగా ఖర్చులు అవుతున్నాయని అత్త అంటున్న సూటిపోటి మాటలు భరించలేక పొత్తిళ్లలోని పసికందును ఓ తల్లి చంపుకుంది. ఈ కేసులో అత్తాకోడళ్లను పోలీసులు అరెస్టు చేశారు.

అత్త సూటిపోటి మాటలకు.. పసికందునే చంపుకొంది

- మోపిదేవి మండలం వెంకటాపురంలో ఓ తల్లి నిర్వాకం

- వీడిని 45 రోజుల శిశువు మృతి మిస్టరీ

- అత్తాకోడళ్లను అరెస్టు చేసిన పోలీసులు

మోపిదేవి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): నెలలు నిండకుండా పుట్టిన బిడ్డ వైద్యానికి అధికంగా ఖర్చులు అవుతున్నాయని అత్త అంటున్న సూటిపోటి మాటలు భరించలేక పొత్తిళ్లలోని పసికందును ఓ తల్లి చంపుకుంది. ఈ కేసులో అత్తాకోడళ్లను పోలీసులు అరెస్టు చేశారు. చల్లపల్లి సీఐ ఈశ్వరరావు, మోపిదేవి ఎస్‌ఐ గౌతమ్‌కుమార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం... మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ప్రభుకుమార్‌, హైదరాబాద్‌కు చెందిన వీరమాచినేని సాయి చైతన్యకు 2024లో వివాహం జరిగింది. వీరికి 45 రోజుల క్రితం ఓ పాప జన్మించింది. ఈ నెల 1వ తేదీ రాత్రి పాప ఇంటి పక్కనే ఉన్న సంపులో శవమైన తేలింది. దీనిపై వీరమాచినేని సాయి చైతన్య సోదరుడు హితేష్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిశువు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టగా, నెలలు నిండకుండా చిన్నారి జన్మించడంతో ఆమె వైద్యానికి డబ్బులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని అత్త రావి వాణి అంటున్న సూటిపోటి మాటలు భరించలేక, మనస్తాపానికి గురైన సాయి చైతన్య ఎవరూ లేని సమయంలో పాపను క్లాతలో చుట్టి ఇంటి ప్రహరీపై నుంచి పక్కనే ఉన్న చెరువులో విసిరేసిందని తేలింది. అనంతరం ఏం తెలియనట్టు పాప కనపడటంలేదని అత్తకు, భర్తకు చెప్పి వెతుకుతున్నట్టు నటించింది. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అనటంతో వద్దు అని వారించినట్టు తెలిసింది. అత్త అంటున్న మాటలను తట్టుకోలేక కోపంలో ఇలా చేసినట్టు విచారణలో ఒప్పుకుంది. శిశువు మరణానికి కారణమైన తల్లి రావి సాయి చైతన్య, ఆమె అత్త రావి వాణిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

Updated Date - Jan 06 , 2026 | 12:42 AM