Kanigiri MLA Ugra Narasimha Reddy: ఒంగోలు లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడిగా ఉగ్ర
ABN , Publish Date - Jan 04 , 2026 | 03:53 AM
ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు...
ఘనంగా బాధ్యతల స్వీకారోత్సవం
ఒంగోలు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు సౌత్ బైపాస్ రోడ్డులోని ఒక కల్యాణ మండపంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనంతోపాటు మంత్రి స్వామి, ఒంగోలు ఎంపీ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇన్‌చార్జిలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవిలో ఉన్నవారు బాధ్యతల స్వీకారోత్సవానికి తరలివచ్చారు. కార్యక్రమానికి ముందుగా స్థానిక వల్లూరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన ఉగ్ర... అక్కడ ఇద్దరు మంత్రులకు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ర్యాలీగా వేదిక వద్దకు వచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ ప్రత్యేక సూచనలతో ఉగ్ర పేరును ప్రతిపాదించారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శితోపాటు యావత్ కమిటీని అధిష్ఠానం ఆచితూచి నియమించింది. అన్ని ప్రాంతాలకు, సామాజికవర్గ్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ఎక్కువ శాతం నిబద్ధతతో పనిచేసే వారికి అవకాశం ఇచ్చారు.