ప్రైవేటు ప్రొఫెసర్లకు ‘స్కేలు’ అడ్డంకి!
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:09 AM
యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో ప్రైవేటు ప్రొఫెసర్లకు అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. యూజీసీ స్కేలుతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయాలనే నిబంధనతోపాటు..
యూజీసీ స్కేలు ఉంటేనే అసోసియేట్, ప్రొఫెసర్లుగా నియామకం
బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఐటీఐఆర్‌లు ఉండాలట
దీంతో పోస్టులకు ‘ప్రైవేటు’ వారంతా అనర్హులే
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో ప్రైవేటు ప్రొఫెసర్లకు అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. యూజీసీ స్కేలుతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయాలనే నిబంధనతోపాటు దానికి సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఐటీఐఆర్‌లు కూడా సమర్పించాలనే నిబంధన పెట్టాలని ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదించింది. కొన్ని వర్సిటీల్లో ఈ వివరాలు లేని అభ్యర్థుల దరఖాస్తులను పక్కనపెడుతున్నట్లు తెలిసింది. ఈ నిబంధనలు అమలుచేస్తే రాష్ట్రంలో డిగ్రీ లెక్చరర్లు మినహా ఇంకెవరూ అర్హులయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసిన వారంతా దాదాపుగా అనర్హులయ్యే ప్రమాదం ఉంది. అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి యూనివర్సిటీలు ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేశాయి. అందులో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 334, ప్రొఫెసర్లు పోస్టులు 63 ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పదేళ్లు లేదా అసోసియేట్ ప్రొఫెసర్‌గా మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. దాంతోపాటు ఎనిమిది జర్నల్స్ పబ్లిష్ చేసి ఉండాలి. అదే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు ఎనిమిదేళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి, ఆరు జర్నల్స్ పబ్లిష్ చేసి ఉండాలి. అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎక్కడ పనిచేసినా యూజీసీ పే స్కేలు తీసుకుని ఉండాలనేది నిబంధన.
ఆ స్కేలు ఎక్కడా ఇవ్వరు
రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలు ఎక్కడా బోధనా సిబ్బందికి యూజీసీ పే స్కేళ్లు ఇవ్వడం లేదు. కొన్ని విద్యాసంస్థలు పేపర్లపై చూపించినా వాస్తవంగా ఆ మేరకు జీతాలు చెల్లించడం లేదు. దీంతో దానికి సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఐటీఐఆర్‌లు కావాలంటే ప్రైవేటులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన వారెవరూ అర్హులు కాలేరు. నిబంధనల ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించుకున్నప్పుడు... ఆ విషయాన్ని సంబంధిత యూనివర్సిటీ ధ్రువీకరిస్తుంది (ర్యాటిఫై). అంటే వారికి మేం యూజీసీ స్కేళ్లు ఇస్తున్నామని ఆయా విద్యా సంస్థలు ఇచ్చిన వివరాలను యూనివర్సిటీలు నిర్ధారిస్తున్నాయి. గతంలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ ధ్రువీకరణనే ప్రామాణికంగా తీసుకునేవారు. లేదా బ్యాంకు స్టేట్‌మెంట్లు లేదా ఐటీఐఆర్‌లు ఏదైనా ఒక దానిని ప్రామాణికంగా భావించేవారు. కానీ ఇప్పుడు యూనివర్సిటీ ఽధ్రువీకరణతోపాటు స్టేట్‌మెంట్లు, ఐటీఐఆర్‌లు ఉండాలని నిబంధన పెట్టడం వల్ల ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారంతా అనర్హులయ్యే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో యూజీసీ పేస్కేళ్లు రెగ్యులర్ డిగ్రీ లెక్చరర్లకు మాత్రమే అందుతున్నాయి. దీంతో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు ఇప్పుడు వారు మాత్రమే అర్హులయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇంటర్వ్యూలకు ఎంపికయ్యే వారిలో ప్రైవేటులో పనిచేసిన వారికి అన్యాయం జరుగుతోంది.